చంద్ర‌బాబు.. మ‌రీ ఇంత దుర్మార్గ వాద‌నా?

మూడు రాజ‌ధానులు పెడ‌తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మెనిఫెస్టోలో ప్ర‌క‌టించ‌లేదు.. భారీ మెజారిటీతో గెలిచాకా ఇప్పుడు మూడు రాజ‌ధానులు అని ఆ పార్టీ అంటోంది.. ఇది ప్ర‌జా తీర్పు కాదు, కాబ‌ట్టి.. వైఎస్ఆర్…

మూడు రాజ‌ధానులు పెడ‌తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మెనిఫెస్టోలో ప్ర‌క‌టించ‌లేదు.. భారీ మెజారిటీతో గెలిచాకా ఇప్పుడు మూడు రాజ‌ధానులు అని ఆ పార్టీ అంటోంది.. ఇది ప్ర‌జా తీర్పు కాదు, కాబ‌ట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయించుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాలి.. అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు తామేదో బ్ర‌హ్మాండ‌మైన లాజిక్కును ప‌ట్టిన‌ట్టుగా ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు రావాల‌ని తెగ ఉబ‌లాట‌ప‌డుతూ ఉన్నారు. సంవ‌త్స‌రం కింద‌ట 23 సీట్ల‌కు ప‌రిమితం అయిన పార్టీ ఇంత‌లోనే ఎన్నిక‌ల‌ను కోరుకుంటే అంత క‌న్నా కామెడీ ఉండ‌దు. అలాంటి కామెడీలు చేయ‌డం తెలుగుదేశం పార్టీకి అల‌వాటు అయిపోయిన‌ట్టుగా ఉంది.

అయినా.. ఇప్పుడు మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌నకు వ్య‌తిరేకంగా మాట్లాడుతూ, ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు చెప్ప‌లేద‌ని అంటున్న తెలుగుదేశం పార్టీ.. త‌మ హ‌యాంలో రాజ‌ధానిని ఎవ‌రిని అడిగి ప్ర‌క‌టించింది?  చాలా లాజికల్ గా మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌ధాని గురించి తెలుగుదేశం పార్టీ ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు!

అప్ప‌టికి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. హైద‌రాబాద్ రాజ‌ధాని, ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ కొన‌సాగే అవ‌కాశం ఉండేది. ఓటుకు నోటు కేసులో చిక్కుకోనంత వ‌ర‌కూ చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ నుంచినే కార్య‌క‌లాపాలు కొన‌సాగించారు. అక్క‌డ దొరికిపోయాకా క‌దా.. హైద‌రాబాద్ అంటే కోపం వ‌చ్చింది! అమ‌రావ‌తి ఆలోచ‌న వ‌చ్చింది! 

ఉమ్మ‌డి రాజ‌ధాని పై హ‌క్కులు వ‌దులుకున్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు ఎవ‌రినైనా అడిగారా? ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని అవ‌కాశం ఉన్నా.. ఆయ‌న ఓటుకు నోటు ఇచ్చాకా క‌దా.. అమ‌రావ‌తి హంగామా మొద‌లైంది. ఉమ్మ‌డి రాజ‌ధాని పై హ‌క్కులు వ‌దిలిన‌ప్పుడు ఎవ‌రినీ అడ‌గ‌ని చంద్ర‌బాబు నాయుడు, అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేసిన‌ప్పుడు కూడా క‌నీసం అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని అయినా నిర్వ‌హించారా? ఎవ‌రి అభిప్రాయాన్ని అయినా తీసుకున్న దాఖ‌లా ఉందా?  

త‌న ఇష్టానికి , త‌మ సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు అనుకూలంగా ఉన్న చోటును చూసుకుని క‌దా.. అమ‌రావ‌తి అంటూ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న చేసింది! అప్పుడే రాయ‌ల‌సీమ నుంచి అభ్యంత‌రం వ్య‌క్తం అయితే ఆ వాయిస్ ను విన‌ప‌డ‌నిచ్చారా?  రాయ‌ల‌సీమ‌కు క‌నీసం హై కోర్టు ఇవ్వ‌మ‌న్న లాయ‌ర్ల‌ను అరెస్టు చేయించింది ఎవ‌రు?  పెద్ద‌మ‌నుషుల ఒప్పందాన్ని తుంగ‌లో తొక్కింది ఎవ‌రు? ఇన్ని చేసి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబు నాయుడు లు క‌ల్ల‌బొల్లి మాట‌లు మాట్లాడ‌టం అస‌లైన విల‌నిజం! ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నందుకు కించిత్ సిగ్గు కూడా ప‌డ‌క‌పోవ‌డం వారి క‌ప‌ట తీరుకు నిద‌ర్శ‌నం!

ఏరు దాటాకా తెప్ప తగలేసిన బాబు