ప్రతి మనిషిలో ఒక మానవీయ కోణం ఉంటుంది.సహజంగా అది తన కుటుంబానికి, తనవారికి పరిమితం అవుతుంటుంది. ‘తన’ అనే భావన లేకుండా అందరి పట్ల ఆ మానవీయ కోణం ఆవిష్కరించగలిగిన వాడు.. సమాజానికి మంచి చేస్తాడు. అలాంటి వాడు నాయకుడు అయితే, అధికారంలోకి కూడా వస్తే.. ఆ తరహా వేరుగా ఉంటుంది. పూర్తి కొత్తగా కూడా ఉంటుంది.. ఇప్పటిదాకా మనకు అలాంటి నాయకులు లేరు గనుక!
జగన్ లోని మానవీయ కోణం ఆయన పాదయాత్రలో కనిపించడంలో విశేషం లేదు. అధికారపీఠం ఎక్కిన తర్వాత.. ఆయన పథకాల్లో కూడా కనిపిస్తోంది. మరో ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవడానికి ఆయన రాజకీయ వ్యూహాల్లో కూడా కనిపిస్తోంది. జగన్ లోని ఆ మానవీయ కోణం గురించిన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర స్టోరీ.
జనం దగ్గరకు వెళ్లినప్పుడు చంటిపిల్లవాడు కనిపిస్తే చంకలోకి ఎత్తుకోవడం.. పండిపోయిన ఓ ముసలమ్మ కనిపిస్తే బుగ్గలు పుణికి పలకరించడం.. ఓ తమ్ముడు ముచ్చటపడితే భుజం మీద చేయి వేసుకుని సెల్ఫీ దిగడం ఇవన్నీ కూడా ఇప్పుడు కామెడీ పీస్ వ్యవహారాలు అయిపోయాయి. సినిమాలలో, ట్రోలింగుల్లో ఇలాంటివి చాలా కామన్ అయ్యాయి. రాజకీయ నాయకుల వెకిలివేషాలను చూపించాలంటే.. వాళ్లను వెటకారం చేయాలంటే.. ఇలాంటి దృశ్యాలు కామన్ అయ్యాయి. ఇలాంటి వాతావరణం మధ్య.. మానవ సంబంధాలకు నిజాయితీగా విలువ ఇచ్చే వ్యక్తిత్వం కనిపిస్తే మాత్రం దాన్ని గుర్తించేది ఎవరు? ఆ మాటకొస్తే, గుర్తించడం ఎలాగ?
నిజాయితీగా మానవ సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కర్మేణా అంటామే.. ఆ రకంగా త్రిరూపశుద్ధిగా ఆ సంగతి బయటపడుతుంది. అధికారంలో లేనప్పుడు– అధికారంలో ఉన్నప్పుడు పాలనలోను– పార్టీ నిర్మాణంలోను.. మూడు రకాలుగానూ ఒకటే రకమైన ఆలోచన సరళి. ఆ సరళి మానవ అనుబంధాలకు పెద్దపీట వేసే వ్యవహారం అయినప్పుడు.. ఖచ్చితంగా మనకు రుజువు దొరుకుతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో మనకు ఆ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన నిర్ణయాల్లో ‘హ్యూమన్ టచ్’ ఉంటుంది. మానవీయ కోణం ఉంటుంది. అది ప్రతిపక్షనేతగా ప్రజల్లో తిరిగినప్పుడు గానీ, ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకునేప్పుడు గానీ, పార్టీ అధినేత వ్యూహాలు రచించేప్పుడు గానీ.. ఆయనలో ఆ మానవీయ కోణం స్పష్టం!
గృహసారథులు.. పార్టీ అనుబంధానికి వారధులు
వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి ఇప్పటినుంచే వ్యూహరచన ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరేసి వంతున కార్యకర్తలు ఉంటారు. వీరిలో ఒక పురుషుడు, ఒక మహిళ ఉంటారు. ఆ యాభై ఇళ్ల ప్రజల అవసరాలను గమనించడం ప్రభుత్వ పరంగా వారి అవసరాలు తీరేలా సంధానకర్తలుగా వ్యవహరించడం వారి బాధ్యత. ఒక్కసారి ఊహించండి… అధికారంలో ఉన్న పార్టీ తరఫున ఎవరైనా ఒక వ్యక్తి.. మన ఇరుగు పొరుగు ప్రాంతంలోనే ఉండేవాడు.. కనిపించినప్పుడు మనల్ని పలకరించి.. ‘ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా’ అని అడగడమే మనకు ఒక కొత్త ఎనర్జీ లాంటి అంశం అవుతుంది. పాజిటివ్ గా అనిపిస్తుంది. ఈ ఆధునిక యుగంలో ఇంట్లో వాళ్లు కూడా ఇరుగుపొరుగు వారిలాగా మారిపోతున్న రోజులవి. పని ఉంటే తప్ప పలకరించుకోని రోజులు. అలాంటిది.. మనం మంచి చెడులు మరొకరు విచారిస్తే ఖచ్చితంగా అది కాస్త పాజిటివ్ భావనను కలిగిస్తుంది.
మనిషి కనిపించినప్పుడు ఖర్చులేని చిరునవ్వులు, పలకరింపులే.. మానవసంబంధాలకు పునాది. ఈ గృహసారథుల వ్యవస్థ ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోని ప్రతి ఇంటితోనూ అలాంటి అనుబంధం నిర్మించడం అనేది సాధ్యం అవుతుంది. అవి తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు కూడా కావొచ్చు గాక.. ద్వేష భావనతో, విషం చూపులతో కాకుండా.. వైసీపీ కార్యకర్త ఒకామె నాలుగుసార్లు పలకరించి కష్టసుఖాలు విచారిస్తే.. వారికి ఒక సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. తమది తెలుగుదేశం కుటుంబమే అయినా.. అంత శ్రద్ధగా విచారించే ఆమె కోసం అయినా.. తమ ఇంట్లో నాలుగు ఓట్లుంటే ఒకటైనా ఫ్యానుకు వేద్దాం అనిపిస్తుంది. మానవసంబంధాలు దృఢపడడం ఇలాంటి ఫలితాన్నిస్తుంది.
తండ్రి మరణించినప్పుడు పలకరింపులే శ్రీకారం..
మహానేత వైఎస్సార్ మరణించినప్పుడు వందల మంది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పలకరించి, వారికి అండగా తాను ఉండగలనని చెప్పాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఆ కార్యక్రమానికి ఓదార్పు యాత్ర అని పేరు పెట్టడమే ఆయన తత్వానికి నిదర్శనం. నిజానికి తండ్రిని కోల్పోయి.. పుట్టెడు శోకంలో ఉన్న కుటుంబం ఆయనదే. కానీ తండ్రి కోసం మరణించిన కుటుంబాలను పలకరించడానికి ‘ఓదార్పు’ యాత్ర గా వెళ్లడం ఆయనకే చెల్లింది.
ఓదార్పు యాత్ర సందర్భంగా గానీ, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయి పాదయాత్ర నిర్వహించినప్పుడు గానీ.. జగన్ జనంతో ఎంతో కలివిడిగా ఆప్యాయంగానే మెలిగారు.
ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.. నుదుట ముద్దులు పెట్టుకున్నారు.. ఆ రూపేణా ఒక సొంత కుటుంబ సభ్యుడిలాగా వారితో తన ఆప్యాయతను ఆయన అలా పంచుకున్నారు. యద్భావం తద్భవతి అని ఒక మాట ఉంటుంది. మనసులో ఉన్నదే మనకు బయటకు కనిపిస్తుంటుంది.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు. అలా జగన్ జనంతో ఆప్యాయంగా మెలగడాన్ని కూడా ఎద్దేవా చేసిన వారున్నారు. కానీ.. ఆయన ప్రదర్శించిన ఆప్యాయత ఒక ఎమోషనల్ అనుబంధానికి పునాదిగా మారుతుందని.. వాళ్లందరూ జగన్ పట్ల ఒక అనుబంధాన్ని కలిగి ఉంటారని.. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చూసే శక్తులు గుర్తించలేకపోయాయి.
అలాంటి ఆప్యాయతను చూపించాలంటే.. మానవసంబంధాల పట్ల చాలా ఇష్టం ఉండాలి. మనుషుల్ని ప్రేమించే తత్వం ఉండాలి. ఆ ప్రేమ అకలుషితం అయి ఉండాలి. ఆ వ్యక్తిత్వం దానికి నిదర్శనంగా నిలవాలి. అదంతా సాధ్యమైంది గనుకనే.. జగన్మోహన్ రెడ్డి పనులు ఆయనకు ప్రజల్లో ఒక నాయకుడిగా కీర్తిని కంటె, తమ సొంత మనిషిగా బంధాన్ని సృష్టించాయి.
కళ్లు నెత్తికెక్కలేదు..
అధికారం లేనప్పుడు, ఓట్లకోసం తిరుగుతున్నప్పుడు ప్రజలతో సన్నిహితంగా మెలగడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అధికారం వచ్చిన తర్వాత చూడాలి.. కళ్లు ఎంతగా నెత్తికెక్కుతాయో అరని అందరూ అనుకుంటారు. సాధారణంగా జరిగేది అదే. కానీ జగన్ విషయంలో వ్యవహారం వేరు. ఇతరత్రా పాలన పరమైన నిర్ణయాలు, రాజకీయ దూకుడుపోకడలు అన్నీ పక్కన పెట్టండి. ప్రజలతో మానవ సంబంధాలు కొనసాగించే విషయంలో ఆయన తిరుగులేని తన వ్యక్తిత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిరూపించుకున్నారు.
అమ్మఒడి లాంటి ఒక అద్భుతమైన పథకాన్ని ఇతర నాయకులు ఎవ్వరైనా కూడా తీసుకురావచ్చు గాక. పిల్లలు చదువుల నుంచి డ్రాపవుట్స్ కాకుండా ఉండాలనే సదుద్దేశంతో గానీ.. తన రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా పిల్లల చదువులను భారంగా భావించే పరిస్థితి ఏర్పడకూడదనే ఉద్దేశంతో గానీ.. మొత్తానికి అమ్మఒడి పథకం రూపుదిద్దుకుంది. ఇతరులు కూడా ఇలాంటి పథకం తేగలరు.. కానీ.. ‘‘రాష్ట్రంలో ప్రతి బిడ్డకీ నేను మేనమామ నవుతా..’’ అని చెప్పగల ఆత్మీయ పోకడ ఒక్క జగన్మోహన్ రెడ్డిలో మాత్రమే మనం చూడగలం. రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు వెళ్లి ఆయనను మామా అని పిలుస్తాడా లేదా తర్వాతి సంగతి.
కానీ అమ్మఒడి రూపంలో వచ్చే సొమ్ములు తీసుకునే ప్రతి తల్లి కూడా.. జగన్మోహన్ రెడ్డిని తన అన్నగానో తమ్ముడిగానో భావించకుండా ఉంటుందా? తన కుటుంబం స్థిరంగా ఉండడానికి, చీకూ చింతా లేకుండా గడపడానికి తన పుట్టింటి వాళ్లు దన్నుగా నిలిచేట్లే.. జగనన్న పుట్టినింటి పాత్ర పోషిస్తున్నాడని మురిసిపోకుండా ఉంటుందా? ఈ కోణంలోంచి మనం ఆలోచించాలి. పథకాలు ప్రతి పార్టీ కూడా తెస్తుంది. అంతో ఇంతో ప్రజలకు మేలు చేయడమే దేశంలో ఏ ప్రభుత్వం తెచ్చే పథకంలోనైనా ఉంటుంది. అయితే ఆ పథకాలకు ఆత్మీయతను, మానవీయ కోణాన్ని, ఆప్యాయతను, మానవ సంబంధాలను మేళవించడం జగన్ లాంటి వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది.
ఈ రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్లు అనేవి ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయి. అయితే.. వారి పింఛను మొత్తాన్ని పెంచడం అనేది కేవలం ఎన్నికల గిమ్మిక్ అనడానికి వీల్లేదు. మీ మనవడిని నేను, ప్రతి అవ్వకు తాతకు కానుకగా ఇస్తాను అని బంధాన్ని కలుపుకుంటూ ఒక పథకాన్ని తీసుకురావాలంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు.
ముఖ్యమంత్రిగా ఆయన ఆచరణలోకి తెచ్చిన ప్రతి పథకంలోను ఓ ఆత్మీయత మనకు కనిపిస్తుంది. ఒక అనుబంధం కనిపిస్తుంది. ఏ పేద కుటుంబం కూడా.. కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాకూడదనే ఆరాటం కనిపిస్తుంది. ప్రతి ఇంటికీ తాను పూచీదారుని, ప్రతి ఇంటిలో మంచిచెడులకు తనకు బాధ్యత ఉంది.. అనే వైఖరి కనిపిస్తుంది. అందుకే.. లక్షల కోట్ల రూపాయల రాజధాని ప్రణాళికల కంటె.. సూడో ప్రగతి పేరిట.. వేల కోట్ల రూపాయలను విచ్చలవిడిగా తగలేసే అబద్ధపు వ్యవహారాలకంటె.. తాను నమ్మిన సంక్షేమ పథమే శ్రేయస్కరమైనదని జగన్ అనుకున్నారు. తన కుటుంబసభ్యులుగా భావించే.. తన సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, అవ్వ తాతల కళ్లలో ఆనందం చూడడమే తన జీవితానికి పరమార్థం అనుకున్నారు. ఆ ఎజెండాతోనే ప్రతి నిర్ణయాన్నీ తీసుకుంటున్నారు.
ఈవేళలో అవసరం..
ఆధునిక సమాజపు పోకడలు సమూలంగా మారిపోతున్నాయి. టెక్నాలజీ విప్లవాలు కావొచ్చు.. అరచేతిలో బ్రహ్మండాల్ని ఇమిడ్చిన మొబైల్ ఫోను విప్లవాలు కావొచ్చు.. ఇప్పుడు నడుస్తున్నవి ఇదివరకటి రోజులు కాదు. పల్లెలో సాయంత్రం అయ్యేవేళకు నలుగురూ రచ్చబండ దగ్గర కూర్చుని కష్టసుఖాలు పంచుకుంటే.. ఒకరి కష్టాలకు మరొకరి దగ్గర పరిష్కారం, ఇంకొకరి కష్టాలకు ఒక చోట ఊరట దొరుకుతుండేవి.
టీవీ చానెళ్ల విప్లవం వచ్చిన తర్వాత.. ఇరుగు పొరుగు కూడా కష్టసుఖాలు మాట్లాడుకునే, కనీసం బరువు దించుకునే రోజులు మారిపోయాయని అందరూ అంటూ వచ్చారు. ఆ యుగం దాటి వచ్చాం. ఇప్పుడు మొబైల్ ఫోన్ల విప్లవం వచ్చిన తర్వాత.. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురు కూడా పరాయివాళ్ల లాగా మెలిగే పరిస్థితులే ఉన్నాయి. అనివార్యంగా మారిపోతున్న సామాజికపోకడలు ఇవి. ఈ విషవలయంలో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్లడమే చేయగలిగిన పని. ఇక మనుషుల మధ్య మానవ సంబంధాలు ఎక్కడ మిగిలిఉన్నాయి.?
మానవ ఇలాంటి ఆధునిక విషతుల్య సామాజిక వాతావరణంలో మన కోసం ఆలోచించే మనిషి మరొకడు ఉన్నాడు అనే భావనే ఎంతో ఊరట కలిగిస్తుంది. ధైర్యం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అలాంటి ఊరటను, ధైర్యాన్ని అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అనుబంధాలకు పెద్దపీట వేసే ఆయన ధోరణి, ఆత్మీయత కూడా కలిసిన ఆయన ప్రభుత్వ పథకాలే అందుకు నిదర్శనం. అందుకే త్రిరూపాలలోనూ ఆయన మానవీయ కోణానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మనకు బోధపడుతుంది. ఆయనలోని ఆ తత్వమే, వ్యక్తిత్వమే ఆయనకు శ్రీరామరక్ష.
ఇలాంటి తత్వం ఉన్న నాయకుడికి ప్రజలు ఎప్పటికీ వెంట ఉంటారు అనేది చాలా చిన్నమాట. ప్రజలు ఎప్పటికీ ఆయనను తమలో ఒకడిగా చూసుకుంటారు.
.. ఎల్. విజయలక్ష్మి