కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుపై జనసేన తేల్చి చెప్పింది. గత కొంత కాలంగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై సాగుతున్న ఉత్కంఠకు జనసేన తెరదించింది.
బద్వేలులో బీజేపీ విజయానికి తమ పార్టీ కృషి చేస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో సంబంధాలపై క్లారిటీ ఇచ్చారు.
బీజేపీతో తమ పార్టీ పొత్తులో ఉందన్నారు. అయితే ప్రజాప్రతినిధి ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులకే తిరిగి ఏకగ్రీవంగా ఇవ్వాలనే సంప్రదాయం ఏపీలో ఉందన్నారు. దాన్ని గౌరవించి బద్వేలు ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడంపై ఆగస్టులోనే జనసేనాని పవన్‌కల్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల తెలిపారు. ఈ విషయాన్ని మిత్రపక్షమైన బీజేపీకి తెలియజేశామన్నారు.
అయితే బీజేపీ జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయం కారణంగా బద్వేలులో పోటీ చేస్తున్నట్టు నాదెండ్ల తెలిపారు. బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో తమ పార్టీ శ్రేణులు పని చేస్తాయని ఆయన తెలిపారు.
భవిష్యత్‌లో కూడా తమ మధ్య పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఇదే నిజమైతే టీడీపీకి చేదు వార్త అని చెప్పొచ్చు.