చాగంటి పవన్ కల్యాణ్ మైక్ అందుకున్నారోచ్!

కార్యకర్తలు కనిపిస్తే చాలు పవన్ లోని పర్సనాల్టీ డెవలప్ మెంట్ గురు బయటకొచ్చేస్తాడు. మైక్ అందిస్తే చాలు, జనసేనాని ఓ తాత్వికుడు అయిపోతాడు. సూక్తులు చెప్పే వేదాంతిగా మారిపోతాడు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు.…

కార్యకర్తలు కనిపిస్తే చాలు పవన్ లోని పర్సనాల్టీ డెవలప్ మెంట్ గురు బయటకొచ్చేస్తాడు. మైక్ అందిస్తే చాలు, జనసేనాని ఓ తాత్వికుడు అయిపోతాడు. సూక్తులు చెప్పే వేదాంతిగా మారిపోతాడు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే. 

పబ్లిక్ మీటింగ్ పెడితే వీరావేశంతో ఊగిపోయి డైలాగ్స్ చెప్పడం, పార్టీ మీటింగ్ అయితే స్వామీజీలా మారిపోయి ప్రవచనాలు వల్లె వేయడం పవన్ కు, అతడి ప్రసంగాలు ఫాలో అయ్యే జనాలకు అలవాటైపోయింది. ఈసారి కూడా పవన్ అదే పని చేశారు. వేసిన క్యాసెట్ నే తిప్పితిప్పి మళ్లీ అరగదీశారు.

చాన్నాళ్ల తర్వాత పవన్ కల్యాణ్ కు తెలంగాణ గుర్తొచ్చింది. ఉండేది హైదరాబాద్ లోనే అయినా, తెలంగాణలో రాజకీయాలు చేయాలనే ఆలోచన పవన్ చేయరు, నిజానికి అలా చేయడానికి పవన్ కు భయం. అది వేరే విషయం. ఈ సంగతి పక్కనపెడితే.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలంగాణ విభాగం క్రీయాశీలక కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. క్రీయాశీలక కార్యకర్తలు అంటే ఏంటని మాత్రం అడక్కూడదు ఇక్కడ.

పవన్ బాబా సూక్తులు విని తరించండి..

ఈ సమావేశంలో మరోసారి స్వామీజీగా మారిపోయారు పవన్. ప్రపంచం మారాలి, సమాజం మారాలి అంటూ సేమ్ ఓల్డ్ సుద్దులు రిపీట్ చేశారు. సుదీర్ఘంగా సాగిన ఇవాళ్టి ప్రసంగంలో లెక్కలేనన్ని ప్రవచనాలు, కోకొల్లల కొటేషన్లు పుట్టుకొచ్చాయి. సెల్ప్ డబ్బా డైలాగులు వీటికి అదనం. వాటిలో మచ్చుకు కొన్ని చూద్దాం.

“బలమైన మార్పు కోసం పోరాటం చేస్తా. ఓడిపోయినా పోరాటం చేస్తా. దెబ్బకొట్టే కొద్దీ ఎదుగుతా. రాజకీయ చదరంగంలో ఆలోచనతో అడుగు ముందుకేయాలి. మార్పు కోసం వచ్చాం. బలమైన సామాజిక చైతన్యం కోసం పార్టీ పెట్టాం. బలమైన భావజాలం కావాలి. నేల తల్లిని మరిచిపోకూడదు. దాష్టీకం, దౌర్జన్యం, అవినీతి, పేదరికంపై పోరాటం. మార్పు కోసం మనం పోరాడాలి. సగటు మనిషి కోసం జనసైనికులు నిలబడాలి. నా ఒక్కడి గెలుపు కోసం రాలేదు.”

పవన్ ప్రవచనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాగా సరిపోదు. జనసైనికులకు లెక్కలేనన్ని వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పారు పవన్ కల్యాణ్. ఒక దశలో రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణ వదిలేసి పవన్ ఇవన్నీ ఎందుకు చెబుతున్నారో అర్థంకాక సైనికులు తలలుగోక్కున్నారు. ఇది అలవాటైన వ్యవహారమే కాబట్టి వెంటనే సర్దుకున్నారు.

ఏ ఎండకు ఆ గొడుగు..

ఆంధ్రప్రదేశ్ లో పవన్ మాటలకు, తెలంగాణలో పవన్ మాటలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏపీలో ఎక్కడ మాట్లాడినా పవన్ ఊగిపోవడం కామన్. ఆ ఊగుడు తెలంగాణలో కనిపించలేదు.

ఏపీలో ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేసే పవన్ కల్యాణ్, తెలంగాణ గడ్డపై మాత్రం ఆచితూచి మాట్లాడారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ విమర్శ లేదు. జగన్ పై నోటికొచ్చినట్టు మాట్లాడే పవన్ కు, తెలంగాణ సీఎం కేసీఆర్ పై, మంత్రి కేటీఆర్ పై మాట్లాడ్డానికి నోరు పెగల్లేదు.

ఇన్నాళ్ల తర్వాత తెలంగాణలో మీటింగ్ పెట్టిన పవన్ కల్యాణ్.. కనీసం తన రాజకీయ ఎజెండా, తెలంగాణలో రాజకీయ కార్యాచరణ కూడా ప్రకటించలేదు. “తెలంగాణ ప్రజలు పిలిచేవరకు నేను రాను, మీ అనుమతి నాకు కావాలి” అంటూ తెలివిగా తప్పించుకున్నారు. అంటే, ఇప్పటికీ తెలంగాణ రాజకీయాలకు జనసేన దూరమే అనే విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారు. ఇంతోటిదానికి మీటింగ్ పెట్టి, కార్యకర్తలకు నీతులు చెప్పడం ఎందుకో అర్థంకాలేదు.

స్ఫూర్తిపొందడానికి తెలంగాణ.. రాజకీయాలకు ఏపీ..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి ఏవేవో మాట్లాడే పవన్ కల్యాణ్, తెలంగాణ వెళ్లేసరికి మాత్రం మాట మార్చేశారు. తెలంగాణ నేలమీద తనకున్న ప్రేమను ఎవ్వరూ ఊహించలేరన్నారు. తను రాజకీయాల్లోకి రావడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి అంత స్ఫూర్తి పొందినప్పుడు, తెలంగాణలో రాజకీయం ఎందుకు చేయరనే ప్రశ్న మాత్రం అడక్కూడదు. అడిగితే ప్రజలు కోరుకోవడం లేదంటారు జనసేనాని.

మొత్తమ్మీద చాన్నాళ్ల తర్వాత ఇటు ఏపీలో, అటు తెలంగాణలో పవన్ తన రాజకీయ ఉనికి చాటుకున్నారు. ఏపీ కార్యకర్తల ముందు వీరావేశంతో ఊగిపోయారు, తెలంగాణ కార్యకర్తల ముందు స్వామీజీలా మారిపోయారు. ఇక ఎంచక్కా వెళ్లి మరో 4-5 నెలలు ఈ రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకోవచ్చు.