‘మంచు’పై లాస్ట్ పంచ్‌

“మా” ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష బ‌రిలో ఉన్న మంచు విష్ణుపై లాస్ట్ పంచ్ క్యాస్ట్ రూపంలో ప‌డింది. తెల్లారితే మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త కొన్ని రోజులుగా సినీ సెల‌బ్రిటీలు వ‌ర్గాలుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో…

“మా” ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష బ‌రిలో ఉన్న మంచు విష్ణుపై లాస్ట్ పంచ్ క్యాస్ట్ రూపంలో ప‌డింది. తెల్లారితే మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త కొన్ని రోజులుగా సినీ సెల‌బ్రిటీలు వ‌ర్గాలుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోసుకున్న సంగ‌తి తెలిసిందే. 

గ‌తంలో ఇండ‌స్ట్రీలో ఇలా ధోర‌ణులు ఎప్పుడూ లేవ‌ని టాలీవుడ్ పెద్ద‌లు వాపోతున్నారు. ముఖ్యంగా “మా”  అధ్య‌క్ష బ‌రిలో ప్ర‌కాశ్‌రాజ్ ఉండ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణంగా కొంద‌రు వేలెత్తి చూపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వాడివేడిగా సాగిన ప్ర‌చారానికి తెరప‌డింద‌ని భావిస్తున్న త‌రుణంలో చిట్ట‌చివ‌రి పంచ్‌గా మంచు విష్ణుపై ఒక కులానికి చెందిన వ్య‌క్తి విస‌ర‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని “మా” ఎన్నికల్లో ఓడించాలని, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  “దేనికైనా రెడీ” సినిమా వివాదంలో బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు చేయించి.. బ్రాహ్మణ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టించి వేదనకు గురిచేశారని గుర్తు చేశారు.  

బ్రాహ్మణ జాతికి కనీస క్షమాపణలు కూడా చెప్పని “మంచు మోహన్ బాబు, మంచు విష్ణు”లను “మా” ఎన్నికల్లో  ఓడించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. “మా” ఎన్నికల్లో కులం ప్రాతిప‌దిక‌న న‌టీన‌టులు చీలి పోయార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, బ‌హిరంగంగా ఆ పేరుతో ప‌ర‌స్ప‌రం ఎవ‌రూ విమ‌ర్శించుకోలేదు. ఆ లోటును  “మా”కు సంబంధం లేని బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కుడు తీర్చిన‌ట్టైంది.