జానా రెడ్డికి ఇంకా రాజకీయ భవిష్యత్తు అవసరమా ?

ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమ భవిష్యత్తు ఏమిటని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. జీవితంలో చాలా విజయాలు సాధించి అన్ని విధాలా జీవితంలో స్థిరపడినవారు కూడా తమ భవిష్యత్తు ఏమిటని బాధపడుతుంటారు. మిగతావారి సంగతి అలా…

ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమ భవిష్యత్తు ఏమిటని ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. జీవితంలో చాలా విజయాలు సాధించి అన్ని విధాలా జీవితంలో స్థిరపడినవారు కూడా తమ భవిష్యత్తు ఏమిటని బాధపడుతుంటారు. మిగతావారి సంగతి అలా పక్కనుంచితే రాజకీయ నాయకులు నిరంతరం తమ రాజకీయ భవిష్యత్తు గురించి తెగ ఆలోచిస్తుంటారు. 

యువ నేతలు ఆలోచిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఎన్నో పదవులు అనుభవించి, తరతరాలకు తరగని ఆస్తులు కూడబెట్టి, తల పండిపోయిన నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఈ క్రమంలోనే పార్టీ మారే ఆలోచన చేస్తారు. 

పోనీ పార్టీ మారినందువల్ల రాజకీయ జీవితం అద్భుతంగా మారిపోయి అందలాలు ఎక్కుతారా అంటే అలాంటిదేమీ ఉండదు. కురువృద్ధులుగా మారాక పార్టీలు మారిన చాలా మంది రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇలాంటి వారి జాబితాలో తెలంగాణా కాంగ్రెస్ కురువృద్ధుడు జానా రెడ్డి కూడా చేరతారని ప్రచారం జరుగుతోంది.

నిజానికి ఆయన కాంగ్రెస్ లో ఉన్నా, వేరే పార్టీలో చేరినా ఏమీ ఫరక్ పడదు. ఆయన కొత్తగా సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఉప్పుడు ఆయనకు 75 ఏళ్ళు. ఇది ఆయనకు జీవితం ముగింపునకు చేరుకుంటున్న దశ. ఈ వయసులో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రధానం. తమకు కాంగ్రెస్ లో భవిష్యత్తు లేదని జానా కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అందుకని కాంగ్రెస్ ను విడిచిపెట్టి అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి పోవాలని ఆలోచన చేస్తున్నారట. ఆ విధమైన ఒత్తిడి వస్తోందట.   

గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో ఇదే తరహాలో ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్ లేదని భావించడమే మరోసారి ఈ ప్రచారానికి కారణమంటున్నారు. జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్నా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

నిజానికి తెలంగాణా ఏర్పడిన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్న వ్యక్తుల్లో జానారెడ్డి మొదటి స్థానంలో ఉంటారు. ఈ విషయం ఆయనే అనేకసార్లు చెప్పారు. అలాంటి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏమీ కాకుండా పోయారు. 

రాజకీయాల్లో ఇలా ప్రభ తగ్గిపోవడం సహజ పరిణామం. 2018 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత నోముల నరసింహయ్య మృతి కారణంగా జరిగిన ఉప ఎన్నికలోనూ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం జానా రెడ్డి  తట్టుకోలేకపోయారు.తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని, కాంగ్రెస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని జానారెడ్డి చెప్పారు.

అయితే సాగర్ ఉప ఎన్నిక తర్వాత జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. అదే సమయంలో జానారెడ్డి కూడా కాంగ్రెస్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమానికి జానారెడ్డికి ఆహ్వానం ఉండటం లేదు. అంటే జానారెడ్డి దాదాపుగా కాంగ్రెస్ రాజకీయాలకు దూరమయినట్లే చెప్పుకోవాలి.

ఇక ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి ప్రస్తుతానికి కాంగ్రెస్ లో యువనేతగా ఉన్నాడు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని గ్రహించిన రఘువీర్ రెడ్డి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనే తండ్రి మీద కూడా ఒత్తిడి తెస్తున్నట్లుగా ఉంది.  సాగర్ లోనే తమ కుటుంబం పట్టు నిలుపుకోవాలంటే అధికార పార్టీలో చేరడమే మంచిదని జానారెడ్డి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 

అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే వెళ్లడానికి సిద్దమంటున్నారు. గతంలోనే జానారెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ లో చేరాలని ఒత్తిడి చేశారు. అయితే అప్పుడు జానారెడ్డి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.

అయితే ఆ ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు భారీ షాకిచ్చారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కూడా ఆయనకు లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జనారెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులు రోజురోజుకు ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. 

టీఆర్ఎస్ లో చేరితే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు నచ్చజెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడాలని ఆయనకు లేకున్నా కుటుంబ సభ్యుల కోరిక మేరకు జానారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని టాక్ విన్పిస్తోంది. సీఎం కేసీఆర్ తనకు స్పష్టమైన హామీ ఇస్తే ఆయన ఏ సమయంలోనైనా టీఆర్ఎస్ చేరే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.