‘మా’ ఎన్నికలకు కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు వుంది. దీంతో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ప్యానళ్ల సభ్యులు ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సాధారణ రాజకీయాల్లో చోటు చేసుకునే విమర్శల కంటే దారుణంగా…తమ వాళ్లు పరస్పరం బురద చల్లుకుంటున్నారని సినీ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితా రాజశేఖర్ తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.
ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాల అవసరం లేదన్నారు. లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముందని జీవితా రాజశేఖర్ ప్రశ్నించారు. ‘మా’ సభ్యుల్లో సుమారు 920 మంది ఉంటారన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయాలంటే భయపడుతున్నారని ఆమె సంచలనం రేకెత్తించారు. ‘అమ్మా మీకు ఓటు వేయగలమా? వచ్చి ఓట్లు గుద్దించుకువెళ్తారేమో’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జీవిత ఆరోపించారు.
ఈ సందర్భంగా రాజీవ్ కనకాల, శివ బాలాజీలపై విమర్శలు చేశారు. వాళ్లిద్దరంటే తనకెంతో గౌరవమన్నారు. కానీ వాళ్లు నిజాలు మాట్లాడడం లేదన్నారు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాట తప్పు అని నిరూపిస్తానంటూ జీవిత సవాల్ విసిరారు. వాళ్లది తప్పని నిరూపితమైతే తమకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఒకవేళ తాను తప్పు మాట్లాడానని ఎవరైనా అనుకుంటే నడి రోడ్డుపై చెప్పుతో కొట్టండంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జీవితా కామెంట్స్‌పై ప్రత్యర్థులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.