వైఎస్సార్ సంకల్పం… జగన్ తోనే సంపూర్ణం

తండ్రి తలచారు, కొంతవరకూ ప్రయత్నించారు. కానీ అర్ధాంతరంగా ఆగిన వాటిని పరిపూర్తి చేసేది మాత్రం తనయుడే అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. జల యజ్ఞం పేరిట ఉమ్మడి ఏపీ సీఎం గా…

తండ్రి తలచారు, కొంతవరకూ ప్రయత్నించారు. కానీ అర్ధాంతరంగా ఆగిన వాటిని పరిపూర్తి చేసేది మాత్రం తనయుడే అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. జల యజ్ఞం పేరిట ఉమ్మడి ఏపీ సీఎం గా వైఎస్సార్ నాడు ఏపీ ఉజ్వల భవిష్యత్తుకు ఎన్నో కలలు కన్నారు. అయితే అవి సాకారం కాక ముందే ఆయన అసువులు బాసారు.

ఇపుడు వాటిని పూర్తి చేయడానికి జగన్ నడుం బిగించారు అంటున్నారు ఆయన. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని నాగావళీ వంశధార ప్రాజెక్టులు మొదలుకుని ఏపీకి ప్రతిష్టాత్మక‌మైన ప్రాజెక్ట్ పోలవరం దాకా జగనే పూర్తి చేసి చూపిస్తారు అంటున్నారు ధర్మాన.

ఇదిలా ఉంటే ఏపీలో పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ళ స్థలాలను మంజూరు చేసిన కార్యక్రమం నభూతో నభవిష్యత్తు అన్నారు. ఈ కీలకమైన సమయంలో సంబంధిత శాఖ మంత్రిగా తాను ఉండడం గర్వంగా ఉందని కూడా ధర్మాన చెప్పుకున్నారు. ఇక రోడ్ల విషయంలో విపక్షాలు చేస్తున్నది పూర్తి రాద్ధాంతమే అని ఆయన అన్నారు.

తొందరలోనే ఏపీ రోడ్లు పూర్తిగా బాగు చేస్తామని, యుద్ధ ప్రాతిపదికన వాటి అభివృద్ధి పనులు సాగుతాయని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ ది సంకల్పం అయితే జగన్  దాన్ని సంపూర్ణం చేస్తాడని ఆయన కితాబు ఇస్తున్నారు.