మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ప్రకాష్ రాజ్ నాన్-లోకల్ అంశాన్ని మంచు విష్ణు హైలెట్ చేస్తుంటే.. మంచు విష్ణు ప్యానెల్ డబ్బులు పంచుతోందనే విషయాన్ని ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఎత్తుకుంది. మంచు విష్ణుపై చేస్తున్న ఈ ఆరోపణల్ని నాగబాబు మరింత ముందుకు తీసుకెళ్లారు. కరోనా పేరిట డబ్బులు పంచుతున్నారని, ఓటు వేసిన తర్వాత మరింత డబ్బు ఇస్తామంటూ ఎర వేస్తున్నారని నాగబాబు ఆరోపించారు.
“మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు, ఆర్టిస్టుల ఇళ్లకు వెళ్లి స్వీట్లు, చీరలు పంచుతున్నారు. సభ్యుల్లో కొందరికి సన్మానం చేస్తున్నారు. ఇక నరేష్ అయితే మరీనూ. కరోనా ఫండ్ ఇది అని చెప్పి సభ్యుల్లో కొందరికి 10వేల రూపాయలు ఇస్తున్నాడు. అసోసియేషన్ ఎన్నికల తర్వాత మరో 15వేలు ఇస్తామంటూ చెబుతున్నాడు. విష్ణు ప్యానెల్ కు ఓటు వేయాలంటూ మాట తీసుకుంటున్నాడు.”
తన ఆరోపణల్ని ఇక్కడితో ఆపలేదు నాగబాబు. ఈరోజు లేదా రేపు పార్క్ హయత్ లో దాదాపు 200 మంది అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు నైట్ పార్టీ ఇస్తున్నాడనే సమాచారం తన వద్ద ఉందంటున్నారు నాగబాబు. ఓవైపు డబ్బులు పంచుతూ, మరోవైపు ఇలా నైట్ పార్టీలు ఇస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని అంటున్నారు.
“ఓట్ల కోసం డబ్బులు పంచడం నేరం. ఈ విషయం మంచు విష్ణు తెలుసుకోవాలి. ఒకేసారి 50 మందికి సంబంధించిన డబ్బును తనే కట్టిన విషయాన్ని విష్ణు అంగీకరించాడు. అంటే.. ఆ 50 మందిని విష్ణు ప్రభావితం చేశాడని అర్థం. దీనిపై మేం కోర్టుకు వెళ్లి ఎలక్షన్ ఆపేయొచ్చు. కానీ అలా చేయం. చిన్న పిల్లాడు తెలిసీతెలియక ఏదో తప్పు చేశాడు, ఇకపై అలాంటివి చేయొద్దని మంచు విష్ణుకు మేం హితబోధ చేశాం.”
మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత మధ్య నలుగుతున్న ఎన్టీఆర్ టాపిక్ ను నాగబాబు కూడా టచ్ చేశారు. ఎన్టీఆర్ తో తను కూడా మాట్లాడానని.. ప్రకాష్ రాజ్ కే ఎన్టీఆర్ ఓటేస్తాడని అన్నారు. తారక్ తో పాటు నాని, రవితేజ లాంటి హీరోలంతా ప్రకాష్ రాజ్ కే ఓటేస్తారని చెప్పిన నాగబాబు.. మెగా కాంపౌండ్ హీరోలందరి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు ఉందని ప్రకటించారు.