తన భార్య, పిల్లలపై సోషల్ మీడియాలో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాపోయారు. తనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులెవరూ లేరని ఆయన చెప్పుకొచ్చారు. కోటంరెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ వెంట కోటంరెడ్డి నడిచారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన ఆనం కుటుంబంతో జగన్ మనుషులుగా కోటంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. ఇప్పటికీ ఆనం కుటుంబంతో నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలకు అంత మంచి సంబంధాలు లేవు.
ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి జగన్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆయన టీడీపీ నేతలతో వ్యక్తిగత వైరం పెంచుకోవడం ఎందుకనే భావనలో ఉన్నారు. అయినప్పటికీ తన కుటుంబాన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారని ఆయన వాపోవడం చర్చనీయాంశమైంది. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో నడిచే కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ఓ అభ్యర్థన చేశారు.
నెల్లూరు రూరల్‌లో తనకు అనుకూలంగా సర్వే నివేదికలు ఉన్నాయన్నారు. అయితే తనపై ప్రజాదరణను ఓర్వలేని కొందరు దురుద్దేశంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. హద్దులు దాటి తన భార్య, పిల్లలపైన దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారని వాపోయారు. తాను ఎవరిని రాజకీయ ప్రత్యర్ధులుగా చూడనని మరోసారి ఆయన స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యులపై ప్రత్యర్థుల నీచమైన పోస్టులు భరించలేని పరిస్థితి వస్తే, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానన్నారు. అంతే తప్ప కార్యకర్తలు, శ్రేయోభిలాషులు రెచ్చిపోవద్దని కోరారు.
ప్రజాజీవితంతో సంబంధం ఉన్న తనతో పాటు తమ్ముడు గిరిపై ఎవరెన్ని విమర్శలు చేసినా సహిస్తామన్నారు. కానీ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని తన భార్య, కుమార్తెలపై నీచమైన పోస్టులు పెట్టే స్థాయికి ప్రత్యర్థులు దిగజారారని విరుచుకుపడ్డారు. ఈ పోస్టుల వెనుక పెద్ద కుట్ర, కుంతంత్రం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన బాగు కోరే వారెవరైనా ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రలకు రెచ్చిపోయి వారి ఉచ్చులో పడొద్దని ఆయన వేడుకున్నారు.