మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంపై మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి బాంబ్ పేల్చిన తర్వాత ఆశావహుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. 100 శాతం కొత్తవారితో జగన్ 2021 టీమ్ ఉంటుందని బాలినేని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో కేబినెట్ బయట ఉన్నవారందరిలో జోష్ పెరిగింది.
ఈ క్రమంలో ఎక్కడా తమపై వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకుంటున్నారు. అవసరమైతే నాలుగు మంచిమాటలు మీడియాలో వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఆయన సొంత ఊరు కోట. కోట పంచాయతీకి సంబంధించి ఇటీవల ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కోల్పోయింది. దీంతో స్థానిక మీడియా నల్లపురెడ్డి 'కోట'కు బీటలంటూ కథనాలిచ్చింది. ఇది డ్యామేజింగ్ గా ఉందంటూ ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అక్కడ పార్టీ ఓటమికి స్థానిక వైసీపీ నేతలే కారణం అంటూ మండిపడ్డారు. లంచాలకు అలవాటు పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు, తాట తీస్తా, తోలు తీస్తా, పార్టీ నుంచి బయటకు నెట్టేస్తానంటూ సొంత పార్టీ నేతలపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆమధ్య నల్లపురెడ్డి ప్రసన్న అనుచరులు, జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంలో టెంకాయలు కొట్టి తమ నాయకుడు మంత్రి అవ్వాలని కోరుకున్నారు. అంతే కాదు, ఆ తర్వాత సోషల్ మీడియాలో మరో ఉద్యమం మొదలు పెట్టారు. ప్రసన్న మంత్రి కావాలంటూ అందరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నట్టు షేర్ చేసుకున్నారు.
ఆయనొక్కరే కాదు, దాదాపు అందరు నాయకుల పరిస్థితి ఇదే. మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నవారంతా.. ఈ టైమ్ లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అధినాయకుడి దృష్టిలో పడేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో సాధించిన విజయాల్ని గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే ఆశావహుల నియోజకవర్గాల్లో ఎంపీటీసీ స్థానాలు ప్రత్యర్థులకు అప్పగించిన వారు మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. అందులోనూ ప్రసన్న సొంతూరు కోటలో, తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఈ విషయాన్ని సీఎం జగన్ పిలిచి మరీ అడిగారట. అప్పట్నుంచి ఆందోళనలోనే ఉన్నారాయన. ఆ తర్వాత ఇప్పుడు అక్కడే ఎంపీటీసీ స్థానం కూడా పోవడం, దాన్ని మీడియా హైలెట్ చేయడంతో మరింత ఇదైపోతున్నారు.
ఈ టైమ్ లో నాపై ఈ దుష్ప్రచారం ఏంటయ్యా, నేను మీకు ఏం అన్యాయం చేశానంటూ మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తన పేరు చూసుకోవాలనుకుంటున్న ప్రసన్న ఇలా కవరింగ్ కష్టాలు పడుతున్నారు.