బీజేపీ, జనసేన మధ్య ప్రేమ ఒక వైపు నుంచి మాత్రమే ఉన్నట్టు కనిపిస్తోంది. జనసేనపై బీజేపీ ప్రేమ ప్రదర్శిస్తున్నదే తప్ప, అటు వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించకపోవడాన్ని గమనించాలి.
తన ప్రేమను అంగీకరించాలని, కలిసి ప్రయాణం సాగిద్దామని జనసేన వెంట బీజేపీ పడుతోంది. కానీ జనసేన నుంచి ప్రేమ సంకేతాలు రాలేదు. పైగా జనసేన మనసులో మరొకరున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇందుకు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. తనపై జనసేన హృదయంలో తనకు చోటు లేదని తెలిసి కూడా బీజేపీ వెంటపడడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బద్వేలు ఉప ఎన్నికల్లో తన మిత్రపక్షం జనసేనను కోరామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.
ఇవేవీ పట్టించుకోకుండా అసలు ఉప ఎన్నిక బరిలోనే నిలవకూడదని నిర్ణయించుకున్నట్టు జనసేన ఏకపక్షంగా ప్రకటించడం బీజేపీకి కోపం తెప్పించింది. అయినప్పటికీ మనసులో ప్రేమను చంపుకోలేక, కోపాన్ని ప్రదర్శించలేక బీజేపీ కొట్టుమిట్టాడుతోంది.
తాను మాత్రం బద్వేలు బరిలో తలపడతానని బీజేపీ ప్రకటించింది. జనసేన మద్దతు ఇస్తుందని బీజేపీ పదేపదే ఆశాభావం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇదిలా వుండగా ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని సోము వీర్రాజు అంటున్నారు.
ఈ మాట తన ప్రేమికురాలు, మిత్రపక్షమైన జనసేన వైపు నుంచి అసలు రావడం లేదు. దీన్నిబట్టి బీజేపీ-జనసేన మధ్య ఒన్‌సైడ్ లవ్ మాత్రమే ఉందనే విషయం అర్థమవుతోంది. కానీ మనసుతో సంబంధం లేకుండా పొత్తు ప్రయాణ ప్రకటనలెందుకని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి.