జగన్ Vs చంద్రబాబు… రెండేళ్ల ముందు నుంచే పోటీ

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటు జగన్, అటు చంద్రబాబు ఇద్దరూ జనం మధ్యకు వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ జనం మధ్యకి వచ్చేసినట్టే.  Advertisement కడప పర్యటనతో దానికి నాంది పలికారు.…

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇటు జగన్, అటు చంద్రబాబు ఇద్దరూ జనం మధ్యకు వచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ జనం మధ్యకి వచ్చేసినట్టే. 

కడప పర్యటనతో దానికి నాంది పలికారు. దసరా తర్వాత తన పర్యటనల్ని మరింత పెంచబోతున్నారు. దీంతో చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు.

ఈ నెలాఖరు నుంచి బాబు కూడా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లూ జూమ్ మీటింగ్స్ తో కాలక్షేపం చేసిన బాబు..ఇప్పుడు జనం మధ్యకొచ్చి వైసీపీ చేస్తున్న పొరపాట్లను, ప్రభుత్వ లోపాల్ని ఎత్తిచూపాలనుకుంటున్నారు. 

దీంతో పాటు పార్టీని నియోజకవర్గ స్థాయిలో బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఓవైపు రోడ్ షోలు, బహిరంగ సభలు చేస్తూనే.. మరోవైపు పార్టీకి కలిసొచ్చే లీడర్లకు పదవుల హామీలు కూడా ఇవ్వబోతున్నారు.

జూమ్ నుంచి లైవ్ లోకి..

ఇప్పటి వరకు బాబుని నేరుగా ఎవరూ కలవలేకపోయేవారు. అన్నీ జూమ్ లోనే జరిగేవి. కానీ ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థితో పాటు మరికొందరు నేతలు నేరుగా హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుని కలిసొచ్చారు. 

ఉప ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. మండలాల వారీగా ఉప ఎన్నిక కోసం ఇంచార్జిలను నియమిస్తానని, తాను కూడా త్వరలో బద్వేల్ లో పర్యటిస్తానని వారికి చెప్పి పంపించారు బాబు.

పవన్ హడావిడి తట్టుకోడానికేనా..?

ఓవైపు పవన్ కల్యాణ్ హడావిడి బాగా మొదలు పెట్టారు. జనసేనతో పాటు, టీడీపీ పేరు కూడా జనాల్లో వినిపించాలంటే బాబు కూడా రంగంలోకి దిగాలి. ముందుగా పవన్ ని పంపించి, ఆయన వ్యవహారం చల్లారే లోపు తాను డైరెక్ట్ గా బరిలోకి వస్తున్నారు బాబు.

బద్వేల్ ఉప ఎన్నికలో గెలిచే అవకాశం లేకపోయినా పార్టీ బతికుండాలంటే బాబు హడావిడి చేయక తప్పదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు జనంలోకి వస్తున్నారు.

ఎన్నికల ఫీవర్ మొదలైనట్టే..

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నిక.. 2024 సార్వత్రిక ఎన్నికలకు శంఖారావం కాబోతోంది. అన్నీ అనుకూలిస్తే జగన్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం కూడా ఉంది. 

సంక్షేమ పథకాలతో ఊపుమీదున్న వైసీపీయే అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ప్రతిపక్షంగా విఫలమైన చంద్రబాబు ఇంకెంత ఎక్కువగా కష్టపడాలి. 

ఓవైపు జగన్, మరోవైపు బాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్.. ఇలా అందరూ ఒకేసారి జనాల్లోకి వస్తుండే సరికి ఏపీలో ఎన్నికల ఫీవర్ ముందుగానే మొదలైంది. బద్వేల్ ఎన్నిక నుంచి పవన్ డ్రాప్ అయినా, జనాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం ఆయన భవిష్యత్ కార్యాచరణను చెప్పకనే చెబుతోంది.