స్త్రీ, పురుషుల వివాహంలో.. చట్టపరమైన విడాకులు చోటు చేసుకున్నప్పుడు స్త్రీకి పురుషుడు పరిహారాన్ని చెల్లించడం అంతర్జాతీయంగా చట్టపరంగా జరుగుతున్నదే. దీనికి మహామహులు కూడా మినహాయింపు కాదు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, స్పోర్ట్స్ స్టార్లు, ఇంకా అనేక రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమ సంపాదన, ఆస్తుల్లో సగభాగాన్ని.. మాజీ సగభాగానికి ఇచ్చి విడాకుల సెటిల్ మెంట్ చేసుకుంటూ ఉంటారు.
పిల్లలు ఉంటే నెల నెలా డబ్బులు పంపే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిహారాలు సరిగా అందని సమయాల్లో.. మాజీ భార్యలు కొందరు కోర్టులకు ఎక్కిన దాఖలాలు కూడా వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాయి. విడాకుల నేపథ్యంలో స్త్రీకి పరిహారం చెల్లించడం అంతర్జాతీయంగా చాలా దేశాల్లో ఉండే చట్టమే. దీనికి భారతదేశం కూడా మినహాయింపు కాదు.
హిందూ వివాహ చట్టం ప్రకారం.. స్త్రీకి పురుషుడు పరిహారాన్ని చెల్లిస్తూ ఉంటాడు. మరి ఇదే లెక్కన నటి సమంతకు ఆమె మాజీ భర్త నాగచైతన్య కూడా పరిహారాన్ని చెల్లించాల్సిందే. అయితే.. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలే హైలెట్ అవుతున్నాయి. వీరి మధ్య విడాకుల సెటిల్మెంట్ గురించి వివిధ పుకార్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఒక ఇంగ్లిష్ దినపత్రిక ఈ అంశం మీద రాస్తూ.. విడాకులతో సమంతకు 200 కోట్ల రూపాయల సెటిల్మెంట్ మనీ అందవచ్చని పేర్కొంది. నాగచైతన్య ఆస్తుల్లో ఆమె సగభాగం పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రెండు వందల కోట్ల రూపాయలు ఆమెకు అందవచ్చని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆ మొత్తాన్ని తీసుకోవడానికి సమంత నిరాకరించినట్టుగా కూడా ఆ పత్రికే పేర్కొంది! రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చే అవకాశం ఉన్నా.. సమంత వాటిని తీసుకోవడానికి నో చెప్పిందనేది ఆ కథన సారాంశం.
అయితే.. నిజంగా అలాంటిది జరిగి ఉంటుందా లేదా.. అనేది సమంత, నాగచైతన్య, ఈ విడాకులను సెట్ చేసిన లాయర్లకే తెలియాలి. పరస్పర అంగీకారంతో విడిపోయినప్పటికీ.. తమ మాజీ భార్యలకు భారీ మొత్తాలను చెల్లిస్తూ ఉంటారు కొందరు స్టార్లు. ఇలాంటి ఖరీదైన విడాకులు వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ఈ భరణాన్ని తీసుకోవడం ఏమీ సిగ్గుపడే అంశం కూడా కాదు.
ఇక ఈ భరణాల గొడవ లేకుండా.. ఎవరి ఆస్తులు వారికే అని ముందే అగ్రిమెంట్ చేసుకుని ఉండవచ్చనే ఒక ప్రచారమూ ఉంది. అయితే అది చట్టపరంగా ఏ మేరకు చెల్లుతుందనేది ప్రశ్నార్థకమే. అలాంటి అగ్రిమెంట్లు మానవహక్కుల ఉల్లంఘన కూడా. అలాంటి అగ్రిమెంట్లకు చట్టంలో అయితే తావు ఉండదు. ఒకవేళ ముందే ఆ మేరకు మాట అనుకుని.. ఆస్తులు, లెక్కలతో సంబంధం లేదనే.. సహజీవనం అయితే చేసుకోవచ్చు కానీ, అధికారికంగా పెళ్లి చెప్పుకుని, వేరే అగ్రిమెంట్లు ఉండటం చట్టపరంగా చెల్లకపోవచ్చు.
స్థూలంగా సమంత ఈ విడాకుల వ్యవహరంలో ఎలాంటి పరిహారం పొందలేదు అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. కాబట్టి.. ఆస్తుల కోసం సమంత వెళ్లి చైతన్యను పెళ్లి చేసుకుందనే ప్రచారానికి చెక్ పడుతున్నట్టే.