అయ్యయ్యో వద్దమ్మా… బద్వేల్ లో పోటీ చేయం!

ఇటీవల సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ చక్కర్లు కొడుతోంది. టీ అడ్వర్టైజ్ మెంట్లో కారులో కూర్చున్న పెద్దావిడ, మేము తిరుపతి సీటు తీసుకున్నాం కదా, మీరు బద్వేల్ లో పోటీ చేయండి అని…

ఇటీవల సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ చక్కర్లు కొడుతోంది. టీ అడ్వర్టైజ్ మెంట్లో కారులో కూర్చున్న పెద్దావిడ, మేము తిరుపతి సీటు తీసుకున్నాం కదా, మీరు బద్వేల్ లో పోటీ చేయండి అని బయట ఉన్న హిజ్రాకు చెబుతుంది. దానికి బదులుగా ఆవిడ అయ్యయ్యో వద్దమ్మా అంటున్నట్టు ఆ మీమ్ క్రియేట్ చేశారు. దీన్ని బీజేపీ, జనసేనకు లింక్ చేస్తూ ట్రోలింగ్ నడిచింది. ఇప్పుడదే నిజమైంది.

పవన్ కల్యాణ్ బద్వేల్ లో పోటీ చేయనంటున్నారు. జనసేన తరపున అభ్యర్థిని బరిలోకి దింపబోమని చెప్పేశారు. ఆ సీటుని ఏకగ్రీవం చేసుకోవాలంటూ వైసీపీకి సలహా ఇచ్చారు.

ఇటీవల పవన్ ఊపు, హుషారు చూస్తే.. కచ్చితంగా బద్వేల్ లో జనసేన తరపున అభ్యర్థిని నిలబెట్టి, కాస్త గట్టిగా ప్రచారం చేస్తారని అనుకున్నారంతా. ఆ సీటు విషయంలోనే ఒకవేళ బీజేపీతో తెగదెంపులు కూడా చేసుకుంటారేమోనని భావించారు. కానీ అవన్నీ వట్టిమాటలే అయ్యాయి. 

ఒకవేళ నిజంగా బీజేపీ ఆ సీటుని జనసేనకు ఆఫర్ చేసినా కూడా తమ పార్టీ పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

ఆయన లెక్కలు ఆయనవి..

2024 ఎన్నికల్లో వైసీపీకి జస్ట్ 15 సీట్లు మాత్రమే వస్తాయి, జనసేన సత్తా చూపిస్తుంది, వచ్చే ఎన్నికల్లో సీఎం అయిన తర్వాతే నన్ను సీఎం అని పిలవండి అంటూ ఇటీవల భారీ డైలాగులు కొట్టారు పవన్ కల్యాణ్. అలాంటి పవన్… నెలరోజుల్లో పోలింగ్ ఉన్న బద్వేల్ ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనంటున్నారు. అసలేంటి కథ..?

బద్వేల్ లో వైసీపీది ఘన విజయం అని టీడీపీ కూడా ఓ అంచనాకు వచ్చింది. అందుకే ప్రయోగాలు చేయకుండా గతంలో పోటీ చేసిన అభ్యర్థికే సీటిచ్చింది. మరోవైపు వైసీపీ.. ఈ ఎన్నికలతో ప్రతిపక్షాలకు గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ముందస్తుగా ఉప ఎన్నికల ప్రణాళికలు రచించింది. 

ఇన్ చార్జిని ప్రకటించి ఎమ్మెల్యేలను మోహరించింది. ఈ దశలో బీజేపీతో గొడవపడి ఆ సీటు తీసుకున్నా పవన్ చేయగలిగిందేమీ లేదు. అత్యాశకు పోయి అన్ని రోజులూ ఆక్కడే ఉండి ప్రచారం చేసినా, చివరకు డిపాజిట్ రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. 

చేతులు కాలాక, ఆకులు పట్టుకోవడం ఎందుకని, పవన్ ముందుగానే అస్త్ర సన్యాసం చేశారు. దానికి త్యాగం అనే ఓ మంచి పేరు పెట్టుకుని ఆ సీటు త్యాగం చేశామని చెప్పేశారు.

మరణించిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చింది కాబట్టి, అక్కడ తాము పోటీ చేయడంలేదని, ఆ సీటు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్టు కూడా సెలవిచ్చారు. ఏకగ్రీవం అంటే జనసేన ఒక్కటే త్యాగం చేస్తే సరిపోదు, మిగతా పార్టీలన్నీ ఆ పని చేయాలి. 

మరి బద్వేల్ లో పోలింగ్ అనివార్యం అయితే పవన్, వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా..? లేక లోపాయికారీగా టీడీపీ అభ్యర్థికి ఓటేయండని చెబుతారా..? వేచి చూడాలి.