విశాఖ వైకాపాలో ‘గంటా’ముసలం?

విశాఖ వైకాపాలో గంటా ముసలం పుట్టేలా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారని వున్నట్లుండి వార్తలు రావడం కలకలం రేపుతోంది. విజయసాయి రెడ్డిని కాదని, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స…

విశాఖ వైకాపాలో గంటా ముసలం పుట్టేలా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు వైకాపాలోకి ఎంట్రీ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారని వున్నట్లుండి వార్తలు రావడం కలకలం రేపుతోంది. విజయసాయి రెడ్డిని కాదని, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ద్వారా గంటా వైకాపాలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

గంటా ఒకందుకు చేరుతున్నారు. బొత్స ఒకందుకు చేరదీస్తుంటే, గంటా ఒకందుకు చేరుతున్నారు. విశాఖపై తమ పట్టు నిలబెట్టుకునేందుకు ఓ బలమైన సామాజిక వర్గం తమ ఆఖరి అస్త్రంగా గంటాను వైకాపాలోకి పంపిస్తోందని రాజకీయ వర్గాల్లో వినిపించడం సంగతి అలా వుంచితే, గంటా ఎంట్రీతో వైకాపాలో కొత్త‌ వర్గాలు పుట్టుకువస్తాయని టాక్ వినిపిస్తోంది.

గంటాకు విశాఖ జిల్లా అంతటా తనకు అంటూ ఓ వర్గం వుంది. అనకాపల్లి, భీమిలి, విశాఖ ప్రాంతాల్లో ఆయన అనుచరవర్గం అనేది ఒకటి వుంది.

ప్రస్తుతం వైకాపాలో ఇంకా ఒకటికి రెండు గ్రూపులు బయల్దేరలేదు. లోకల్ గా చిన్న చిన్న నాయకులు గ్రూపులుగా వున్నారు కానీ శాసనసభ్యుల లెవెల్ కు వచ్చే సరికి మాత్రం సింగిల్ వాయిస్ నే వినిపిస్తోంది. 

కానీ ఇప్పుడు గంటా వస్తే అన్ని చోట్ల మళ్లీ డబుల్ వాయిస్ స్టార్ట్ అయ్యే ప్రమాదం అయితే పక్కాగా వుంది. ఎందుకంటే గంటాతో పాటు ఆయన అనుచర వర్గం కూడా వైకాపాలోకి కొంతయినా వస్తుంది. స్థానిక ఎన్నికల్లో  టికెట్ ల దగ్గర కు వచ్చేసరికి అసలు వ్యవహారం స్టార్ట్ అవుతుంది.

ఇవన్నీ ఊహించుకుని వైకాపాలోని ఇప్పటికే వున్నవారు అప్పుడే ఆందోళనపడుతున్నారు. అలాగే గంటా వస్తే, ఇప్పటికే వైకాపాలో లీడ్ లో వున్న ఎమ్మెల్యేలు కూడా తమ వ్యవహారం ముందు ముందు ఎలా వుంటుందో అని కిందా మీదా అవుతున్నట్లు బోగట్టా.

విజయసాయి రెడ్డి హవా ఇప్పటి వరకు అప్రతిహతంగా వుంది. ఆయన రాష్ట్రస్థాయి నాయకుడు. అంటే రాష్ట్ర స్థాయి నాయకుల లెవెల్ లో గ్రూపులు ప్రారంభమై, ఎమ్మెల్యేల లెవెల్ లో వర్గాలు ప్రారంభమై, స్థానిక స్థాయిలో కూడా వేరు వేరు టీమ్ లు వస్తే, వైకాపా పరిస్థితి ఎలా వుంటుందీ అన్నది రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ గా మారింది.

మొత్తం మీద వైకాపాలో గంటా మోగిస్తున్న సంచలనం ఇంతా అంతా కాదేమో?

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్