ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ హీరోయిన్. అలాంటప్పుడు ఆ సినిమాతో అలియా భట్ కు పోటీ ఏముంటుంది? ఇలా అనుకోవడానికి వీల్లేదు. పోటీ ఉండబోతోంది. అలియా భట్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు.. ఆమె నటించిన మరో సినిమా జస్ట్ వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి అనే సినిమాను రిలీజ్ కు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది జనవరి 6న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. కట్ చేస్తే, ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా జనవరి బరిలో నిలిపేందుకు తెరవెనక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
అన్నీ సెట్ చేసి జనవరి 12న ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఆర్ఆర్ఆర్ తో అలియాభట్ సినిమాకు పోటీ తప్పదు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ టైపులోనే గంగూబాయి కతియావాడి సినిమాను కూడా పలు భాషల్లో (తెలుగుతో సహా) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గంగూబాయి కతియావాడి సినిమా తెలుగులో ఆర్ఆర్ఆర్ కు ఎంతమాత్రం పోటీ కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ బాలీవుడ్ లో పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. అక్కడ అలియాకు పెద్ద మార్కెట్ ఉంది. పైగా ఆ సినిమాకు భన్సాలీ దర్శకుడు. ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ సినిమాకు అలియాభట్ మూవీ హిందీలో కచ్చితంగా పోటీ ఇస్తుంది.
మరోవైపు టాలీవుడ్ సంక్రాంతి రిలీజుల్లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సర్కారువారి పాటను సంక్రాంతి బరి నుంచి తప్పించి, ఉగాదికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాధేశ్యామ్ రావడం మాత్రం పక్కా. భీమ్లానాయక్ పై మాత్రం అనుమానాలున్నాయి.