వైసీపీ నేతల తాట, తోలు తీస్తానని హెచ్చరించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఓ ప్రముఖ మహిళా సామాజికవేత్త రూపంలో గట్టి షాక్ తగిలింది. తెలుగు సమాజంలో ప్రజాఉద్యమాలతో సంబంధం ఉన్నవాళ్లకు ప్రముఖ మహిళా సామాజిక వేత్త దేవి సుపరిచితురాలే. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ కాలుష్యంపై ఆమె తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ పేరు ప్రస్తావించకుండానే తాట తీశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, పవన్ మధ్య నడుస్తున్న గొడవపై స్పందించారు. మహిళా సామాజికవేత్త దేవి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఏమన్నారో దేవి మాటల్లోనే…
“తోలు తీస్తా, కళ్లు పీకుతా, నాలుక పీకుతా.. ఇలాంటి భాషతో పాటు రాజకీయ మర్యాదల్ని అతిక్రమించి వాడకూడని పదాలు వాడడమనేది రాజకీయాల్లో పరిపాటైపోయింది. ఎవరెంత జోరుగా బూతులు తిడితే వారంత పవర్‌ఫుల్ నాయకులనుకునే దురదృష్టకర పబ్లిక్ వాతావరణాన్ని మన రాజకీయ నాయకులు కల్పించారు. సామాజిక సభ్యతను అధిగమించాలి, రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చని రాజకీయ నాయకులు పనికిమాలిన సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.
సాధారణంగా సినిమా వాళ్లకు వేరే వాళ్లు డైలాగ్‌లు రాస్తే చెప్పడం అలవాటు. సొంతంగా చెప్పడం చాలా కష్టమైన విషయం. మన దగ్గర సబ్జెక్టు లేనప్పుడు ఏం చేద్దాం? సబ్జెక్టు లేనప్పుడు పవర్‌ఫుల్‌గా కనపడాలి కదా…ఎదుటి వాళ్లను బూతులు తిట్టడం ద్వారా…అంటే సినిమాల్లో వాటికి విజిల్స్ పడతాయి. అదే పనికి మాలిన సంప్రదాయాన్ని పబ్లిక్ రంగంలోకి, సినిమా రంగంలోకి ఇవాళ వాళ్లు మారుస్తున్నారు.
రాజకీయాలు ప్రజల జీవితాలతో ముడిపడి వుంటాయి. తప్పుడు సినిమా తీస్తే, పనికి మాలిన సినిమా తీస్తే వాళ్లవి (ప్రేక్షకులు) వంద రూపాయలు పోతాయి. అక్కడితో ప్రేక్షకులు తిట్టుకుని బయటికొస్తారు. లేదు విజిల్ వేసి బయటికొస్తారు. అంతటితో అయిపోతుంది.
రాజకీయ రంగంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాటలు, రాజకీయ రంగంలో ఇలాంటి చెత్త, నీచమైన సంప్రదాయం ప్రవేశ పెట్టడమనేది ఓవరాల్‌గా ఒక వాతావరణాన్ని, సభ్యతని, సంస్కారాన్ని దెబ్బతీస్తాయి. ఎవరైతే దీన్ని ముందుగా ప్రారంభించారో వాళ్లందర్నీ ఇన్‌డీసెన్సీ కింద లోపలేయండి. వాళ్లకు అసలు హద్దుఅదుపూ లేకుండా పోతుంది. వాళ్ల అభిమానులుంటే చాలు అని కోతులు మాదిరిగా గెంతుతున్నారు.
నీకు హీరో అయి వుండొచ్చు. నీ హీరో అందరికీ హీరో కావాల్నా? పబ్లిక్ లైఫ్‌లోకి వస్తే ఎవరినైనా విమర్శిస్తాం. వాళ్లు జవాబు చెప్పుకోవాలి. పబ్లిక్‌లో ఎవరూ నన్ను విమర్శించొద్దని అనుకుంటే ఇంట్లో కూచో. ప్రజాజీవితంలోకి రావద్దు. ప్రజాజీవితంలో తీవ్రమైన విమర్శలుంటాయి. నీ పద్ధతుల మీద ఉంటాయి, నీ ప్రవర్తనపై వుంటాయి. నీ విధానాలపై వుంటాయి. చేతనైతే జవాబు చెప్పుకో.
నన్నెవరూ విమర్శించొద్దు, మా హీరోని ఎవరూ విమర్శించొద్దంటే …మీ హీరోని తీసుకెళ్లి లోపల ముసిగేసి కూచోపెట్టండి. అప్పుడు నడుపుకోండి, మేమెవరం ఏమీ విమర్శించం. అప్పుడు మేము అడగాల్సిన ప్రశ్నే వుండదు. పబ్లిక్ లైఫ్‌లో నేను మాత్రం అందర్నీ తిడతా. నా నోటికొచ్చింది వాగుతా. అవగాహన లేకుండా వాగుతా. పూటకో పార్టీ మారుతా. కానీ మీరెవరూ నన్ను విమర్శించొద్దు అంటే…ఆ విధంగా ప్రజా జీవితంలో నడవదు.
నువ్వేమీ దేవుడివి, అతీతుడివి కాదు. పబ్లిక్ లైఫ్‌లో జవాబు చెప్పాల్సిందే. ఏ రాజకీయ నాయకుడికైనా ఇది కరెక్ట్. సినిమా హీరోకైనా ఇది కరెక్ట్. నువ్వో సినిమా తీస్తే, అది నచ్చకపోతే వంద రూపాయలు నీ మొహాన ఎందుకు పెట్టినట్టు అని నేను అడుగుతా. నువ్వు జవాబు చెప్పాలి. ఇదేం కాదండి నేను ఇంట్లో ఉంటానంటే ఇంట్లోనే వుండు. నిన్ను ఎవరూ అడగరు. గిల్లరు, గిచ్చరు, మాట్లాడరు” అని దేవి చెంఫ చెళ్లుమనిపించే మాటలు చెప్పారు. సామాజిక కార్యకర్త దేవికి జనసేన వైపు నుంచి ఎలాంటి జవాబు వస్తుందో చూడాలి.