‘తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుంటే , రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం గా చేతులు ముడుచుకుని కూచోవడం నేరపూరిత నిర్లక్ష్యం. మా ఆదేశాలను అమలు చేయడానికి ఇది మికిచ్చే నాలుగో, చివరి అవకాశం. దీన్ని అమలు చేయకపోతే ఉద్యోగాలు పోతాయ్’…తెలంగాణ సర్కార్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు రెండు రోజుల క్రితం చేసిన ఘాటు వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేశారనే ఒక్క వ్యాఖ్య …తెలంగాణ సర్కార్ పాలనను అర్థం చేసుకోడానికి చాలు.
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంపై తెలంగాణ సర్కార్ మొదటి నుంచీ నిర్లక్ష్యం, నిరాసక్తత ప్రదర్శిస్తోందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 2,76,222 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇదే ఆంధ్రప్రదేశ్ విష యానికి ఆ సంఖ్య 14 లక్షలకు చేరువలో ఉంది.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలకు తెలంగాణ సర్కార్ హృదయం గాయపడింది. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తజా రిజ్వీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ వైద్య శాఖల విభాగాధిపతులు శ్రీనివాస్, రమేశ్‌రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటన హైకోర్టు వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎంతగా ఆవేదన చెందుతున్నదో కళ్లకు కట్టింది.
‘ఎంత మందికైనా చికిత్స అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహి స్తున్నాం. ఇంత చేసినా.. హైకోర్టు వ్యాఖ్యలు చేస్తుండటం బాధ కలిగిస్తోంది. కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి ఏకంగా 87 పిల్స్‌ను స్వీకరించింది. వాటిపై విచారణ జరపడం, వాటికి నిత్యం అధికారులు హాజరు కావడం, చివరికి, వివిధ పనుల్లో తీరిక లేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతోంది’ అని సమావేశంలో అభిప్రాయపడినట్టు సీఎంవో తన ప్రకటనలో పేర్కొంది.
హైకోర్టు వ్యాఖ్యలతో పాటు కొన్ని మీడియా సంస్థల వార్తలు ప్రభుత్వం ఏమీ చేయలేదనే భావనను ప్రజల్లో కలిగిస్తున్నాయని, ఇలాంటివి వైద్య సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని పలువురు తమ నిరసన వ్యక్తం చేశారని ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ అభిప్రాయాలను విన్న కేసీఆర్… వైరస్ నిర్ధారిత పరీక్షలు, రోగులకు అందిస్తున్న సేవలు, ఇతరత్రా అంశాల్లో సమగ్ర సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు, హైకోర్టు అడిగే అన్ని వివరాలను అందజేయాలని ఆయన ఆదేశించారు.
కొంత కాలంగా తెలంగాణ సర్కార్‌పై కరోనా విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ విషయాన్ని హైకోర్టే స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ, రోగులకు సేవలపై తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హైకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే. పదేపదే తమను మొట్టికాయలు వేస్తుండడంతో సీఎం కేసీఆర్ ఎదుట ఉన్నతాధికారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.