కమెడియన్, నిర్మాత బండ్ల గణేశ్‌ను గుర్తు తెచ్చేలా నాదెండ్ల మనోహర్ స్పీచ్ దంచి కొడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను చూస్తే బండ్ల గణేశ్ పూనకం వచ్చిన వాడల్లా ఊగిపోతూ వుండడం అనేకసార్లు చూశాం.
బండ్ల గణేశ్ స్పీచ్ అంటే అదో అదనపు ఎంటర్‌టైన్ మెంట్ కింద లెక్క. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అచ్చం బండ్ల గణేశ్ మాదిరిగానే ప్రసంగాలు ఇస్తున్నారని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను కాపాడమంటే పవన్‌ను కాపాడాలని అర్థం కాదని మనోహర్ చెప్పుకొచ్చారు.
రిపబ్లిక్ పంక్షన్‌లో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చేసిన వాగ్దానాలపైనే పవన్ మాట్లాడారన్నారు. దానిపై ఎందుకు సమాధానం చెప్పరు? అని మనోహర్ నిలదీశారు.
పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే సినిమా వాళ్లను వాడుకుంటున్నారని పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఎపిసోడ్‌ను ప్రస్తావించారు. ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఇప్పుడే జనసేనే బలమైన ప్రతిపక్షమని ఆయన ప్రకటించడం నవ్వులు పూయించింది.
ఒక్కసారిగా జనసేన ఎదుగుతోందని భయపడి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని మనోహర్ అన్న మాటలు విన్న తర్వాత బండ్ల గుర్తు రాకుండా ఎలా వుండగలరు? అంతేనా, పవన్ పదవి కోసం వెంపర్లాడే వ్యక్తి కాదని, నిజాయతీగా ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా నాదెండ్ల అభివర్ణించడం విశేషం.
ఇలా అడుగడుగునా పవన్‌కల్యాణ్ గొప్పతనాన్ని ఆకాశమే హద్దుగా నాదెండ్ల మాట్లాడ్డం… సినిమా ప్రమోషన్ ఫంక్షన్‌ను గుర్తు తెచ్చింది. సినిమా షూటింగ్ లేకుంటే తప్ప కనిపించని పవన్‌ను గొప్ప పోరాట యోధుడిగా ప్రకటించుకోవడం జనసేన నేతలకే చెల్లింది.