ఎక్కే మెట్లు.. దిగే మెట్లు..నిమ్మగడ్డకు దారేది

నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల కమిషనర్ గా వస్తారంటూ కలలుగన్న టీడీపీకి నిరాశే మిగిలింది. మళ్లీ చక్రం తిప్పుతానంటూ కోర్టు మెట్లెక్కిన ఆయన.. న్యాయస్థానం ఆదేశాలతో చివరకు గవర్నర్ కి మొరపెట్టుకుని ఖాళీ చేతులతో వెనుదిరిగారు.…

నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల కమిషనర్ గా వస్తారంటూ కలలుగన్న టీడీపీకి నిరాశే మిగిలింది. మళ్లీ చక్రం తిప్పుతానంటూ కోర్టు మెట్లెక్కిన ఆయన.. న్యాయస్థానం ఆదేశాలతో చివరకు గవర్నర్ కి మొరపెట్టుకుని ఖాళీ చేతులతో వెనుదిరిగారు. రాష్ట్రంలో సంచలనం జరిగిపోతుందని నిన్న రాత్రి వరకు ఎదురుచూసిన చాలామంది “తమ్ముళ్లు” హతాశయులయ్యారు. గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటనేమీ రాలేదు సరికదా.. అసలు గవర్నర్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారనే విషయం కూడా తేలలేదు.

మరోవైపు టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఈరోజు తెల్లారేసరికి యథాప్రకారం సానుకూలంగా స్పందించిన గవర్నర్, ఆశాభావం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ.. అంటూ కథనాలు రాసుకొచ్చింది. అయితే వాస్తవానికి నిమ్మగడ్డ వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.

కరోనా కష్టాలు తొలగిపోయి.. తిరిగి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సానుకూల సమయం వచ్చే వరకు ఏపీకి ఎన్నికల కమిషనర్ ఉండకపోవచ్చు. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త ఆందోళనతో ఉన్నమాట వాస్తవమే. 

గవర్నర్ ని నిమ్మగడ్డ కలసిన సమయంలో.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. నిమ్మగడ్డ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో పోలీసులు వెనక్కు వెళ్లిపోయారు. ప్రభుత్వం అనుమానించినట్టు కానీ, ప్రతిపక్షాలు ఎదురు చూసినట్టు కానీ ఏ సంచలనాలూ రమేశ్ కుమార్ వ్యవహారంలో జరగలేదు. తన ఆదేశాలను ఎందుకు ఆలస్యం చేశారంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, చివరకు బంతి గవర్నర్ కోర్టులోకి నెట్టివేయడంతో అధికారపక్షానికి ఊరట లభించినట్లయింది.

ఇక గవర్నర్ కూడా ప్రభుత్వ సలహా సంప్రదింపులతోటే కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం. అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తే.. మరికొన్ని రోజులు నిమ్మగడ్డ వ్యవహారం కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నట్టే లెక్క. ఇక ఈ విషయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చూస్తుండటంతో అసలు టీడీపీ, నిమ్మగడ్డ ఉమ్మడి కల నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారింది.

వాస్తవానికి గతంలోనే కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ పదవిలోకి రావాలని చూశారు. అత్యుత్సాహంతో కోర్టు ఆదేశాలొచ్చిన రోజే సిబ్బందిని ట్రాన్స్ ఫర్ చేశారు కూడా. కానీ ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లడంతో ఆయన ఆటలు సాగలేదు. తీరా ఇప్పుడు గవర్నర్ ని కలిసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. సానుకూలంగా స్పందించారంటూ, సానుకూల మీడియాలో రాయించుకున్నారు కానీ ఫలితం లేదని తేలిపోయింది.  

షకలక శంకర్ డిరా బాబా వెబ్ సిరీస్ ట్రైలర్

పరాన్నజీవి ఫస్ట్ సాంగ్ రిలీజ్