ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లు వచ్చేస్తాయి అనే టైమ్ లో, లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ మాటల తూటాలు విసిరారు. దాంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. ఆపై దానికి పోసాని కృష్ణ మురళి నుంచి రియాక్షన్ వచ్చింది.
దీంతో ఇక ఇప్పట్లో టాలీవుడ్ కష్టాలు తీరవు అని డిసైడ్ అయిపోయారు టాలీవుడ్ జనాలు. పైగా అంతలోనే పవన్ ఫ్యాన్స్ హడావుడి. ఇదంతా కలిసి టికెట్ రేట్ల వ్యవహారాన్ని ఎక్కడ దూరం జరిపేస్తుందో అని భయపడుతున్నారు.
అందుకే డ్యామేజ్ కంట్రోలు కోసం టాలీవుడ్ ప్రముఖులు కొందరు ఆంధ్రకు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ కోరి మరీ తీసుకున్నారని బోగట్టా. ఈ మేరకు కొంతమంది బయల్దేరి వెళ్లారు.
మొన్నటికి మొన్న పవన్ ఉపన్యాసం టైమ్ లో ఎదురుగా వుండి, నవ్వులు రువ్వినందుకు వైకాపా అధిష్టానం దగ్గర ఇమేజ్ డ్యామేజ్ అయిందని వినిపిస్తున్న నిర్మాత దిల్ రాజు కూడా ఈ టీమ్ లో వున్నారని తెలుస్తోంది. బన్నీ వాస్, ఆసియన్ సునీల్, దానయ్య తో సహా పలువురు స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని వెళ్లారు . మంత్రి మచిలీ పట్నంలో వుండడంతో అక్కడకు వెళ్లి కలుస్తారు.
ఏదో విధంగా మంత్రిని ప్రసన్నం చేసుకుని, ఇండస్ట్రీ అంతా జగన్ తోనే వుందని, పవన్ తో కాదని చెప్పి, టికెట్ రేట్లు పెంచుకుని వచ్చే పని పెట్టుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. మరి వీరి ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.