అవును. ఎక్కడ అరకు. మరెక్కడ తిరుపతి. ఏడు కొండలు ఎక్కి స్వామిని మొక్కడమే ధన్యమనుకునే ఆధ్యాత్మికత మనది. అలాంటిది విశాఖ జిల్లా మన్యంలో పుట్టిన పుట్ట తేనె ఆ స్వామి నిత్యాభిషేకానికి వినియోగించడం అంటే నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నట్లో కదా.
అరకు తేనెతో స్వామి వారికి అభిషేకం చేయాలని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు కిలో తేనెను ఇప్పటికే తీసుకువచ్చి నమూనా పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో సంతృప్తి చేసింది.
అరకు తేనె స్వచ్చత, నాణ్యతా ప్రమాణాల విషయంలో టీటీడీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖలో ఉన్న గిరిజన సహకార సంస్థ ద్వారా పెద్ద ఎత్తున అరకు తేనెకు టీటీడీ ఆర్డర్ ఇచ్చినట్లుగా అధికారులు తెలియచేశారు.
ఈ విధంగా అరకు తేనెకు ఆధ్యాత్మిక గుభాళింపు గుర్తింపు దక్కడమే కాదు, మంచి బ్రాండింగ్ కూడా ఏర్పడినట్లుగా వారు చెబుతున్నారు. ఇంకో వైపు దళారునను పక్కన పెట్టి టీటీడీ నేరుగా అరకు తేనెను కొనుగోలు చేయడం ద్వారా గిరిజనులకు భారీగా లబ్దిని చేకూర్చనుంది.
మొత్తానికి ఏడుకొండల వాడు ఎంత గొప్పవాడు అంటే తనకు ఏది కావాల్సినా ఎంత దూరంలో ఉన్నా తెచ్చుకోవడమే కాదు, వాటికి పవిత్రతను సార్ధకతను సమకూర్చి మరీ ధన్యత చెందేలా చేస్తున్నారు అని ఆధ్యాత్మిక పరులు మురిసిపోతున్నారు.