బీజేపీ, జనసేన పార్టీలు మిత్రపక్షాలనే మాటే గానీ, ఆచరణలో మాత్రం అలా కనిపించడం లేదు. పొత్తు కుదుర్చుకున్న సందర్భంగా చేసుకున్న ఒప్పందాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.
అధికార పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ప్రత్యామ్నాయంగా మూడో కూటమిగా బీజేపీ-జనసేన జట్టు కట్టాయి. అయితే రెండు పార్టీల మధ్య సమన్వయలోపమో, మరే కారణమో తెలియదు కానీ, క్షేత్రస్థాయిలో అవి రెండు కలిసి ముందుకు సాగిన, సాగుతున్న వాతావరణం లేదు.
ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. అది బద్వేలు ఉప ఎన్నిక రూపంలో కావడం గమనార్హం. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేయాలని జనసేన ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ఆ ఉప ఎన్నికలో అంతిమంగా బీజేపీనే బరిలో నిలిచి, మిత్రపక్షంపై పైచేయి సాధించిందని చెప్పొచ్చు.
ఇదిలా వుండగా వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆకస్మిక మృతితో కడప జిల్లా బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెలాఖరులో ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ, టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేర్లను ప్రకటించాయి. ఇక్కడ పోటీపై ఇవాళ జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని చర్చించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
బద్వేలులో బలాబలాలపై కడప జిల్లా జనసేన నేతలను పవన్‌కల్యాణ్ ఆరా తీయనున్నారని తెలిసింది. దీన్ని బట్టి బీజేపీ అభిప్రాయంతో సంబంధం లేకుండా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయాలని పవన్‌కల్యాన్ భావిస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి బీజేపీ ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకుంది. ఒక రకంగా బీజేపీ, జనసేన మధ్య పొత్తుకు ఇదో అగ్ని పరీక్ష అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.