బాలీవుడ్ సుశాంత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజమ్ (బంధుప్రీతి)పై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ కాస్తా క్రమంగా రచ్చకు దారి తీస్తోంది. బాలీవుడ్‌లో ఇద్దరు హీరోయిన్‌ల మధ్య పరోక్ష గొడవకు నెపోటిజమ్ కారణమైంది. ఆ ఇద్దరు బ్యూటీలు కంగనా రనౌత్, తాప్సీ.
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత తన బాగోగుల గురించి ఇతరులు ఆరా తీయడం ఎక్కువైందని తాప్సీ చెబుతు న్నారు. దీనికి కారణం సుశాంత్ మాదిరిగానే తాను కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడమే అని ఆమె చెప్పుకొస్తున్నారు.
ఇటీవల తనకు వచ్చే ఫోన్‌కాల్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. బాలీవుడ్ అవుట్‌సైడర్‌గా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటూ తనను ఫోన్‌లో చాలా మంది ఆరా తీస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపారు. అసలు తానెప్పుడూ సుశాంత్‌ను కలవలేదని, అతను మృతి చెందినప్పటి నుంచి ‘ఆర్ యు ఓకే, నువ్వు బాగానే ఉన్నావా? సంతోషంగానే ఉంటున్నావా? ఏవైనా విషయాలు మనసు విప్పి చెప్పాలనుకుంటున్నావా?’ అంటూ తనకు రోజు ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
సినిమాల కోసం తాప్సీ తన చెల్లెలితో కలిసి ముంబయ్‌లో ఉంటున్నారు. తాప్సీ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. దీంతో తమ ఇరుగుపొరుగు కుటుంబ సభ్యులు కూడా తమతో చాలా ప్రేమగా వ్యవహరిస్తారని తాప్సీ తెలిపారు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో విచిత్ర వాతావరణం నెలకొందన్నారు. అదేంటోగానీ సినీ బ్యాగ్రౌండ్ లేని వారిపై సానుభూతి చూపడం…అది ఔట్‌సైడర్స్ నుంచి అని తాప్సీ ఆశ్చర్యంగా చెప్పుకొచ్చారు.
‘బాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేనివాళ్లు చాలా కష్టాలు పడుతున్నారనే సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కావాలనే కొందరు సృష్టిస్తున్నారు. దీంతో బ్యాగ్రౌండ్ లేనివాళ్లు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకునేవాళ్లు భయపడాల్సి వస్తోంది’ అని తాప్సీ ఆవేదన చెందారు.
మరీ ముఖ్యంగా కంగనా రనౌత్ మాటలు తాప్సీని బాగా హర్ట్ చేసినట్టు తెలుస్తోంది. హీరోయిన్స్ తాప్సీ, స్వరా భాస్కర్‌లను ‘బీ గ్రేడ్ యాక్టర్స్’ అని కంగనా రనౌత్ అన్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై తాప్సీ ట్వీటర్ వేదికగా పరోక్షంగా స్పందిస్తూ…‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్ సిస్టమ్ అధికారికమేనా? ఇప్పటి వరకు నెంబర్ సిస్టమ్ అనుకున్నానే!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు తాప్సీ.
కంగనా, తాప్సీ మధ్య గొడవకు వేరే కారణం ఉంది. కరణ్ జోహార్‌ను తాప్సీ వెనకేసుకు రావడమే కంగనా కోపానికి కారణమై ఉండొచ్చని బాలీవుడ్ టాక్. కరణ్ జోహార్ తన వారసులను మాత్రమే ప్రోత్సహిస్తాడని ఆ మధ్య కంగనా విమర్శలు గుప్పించారు. కంగనా కామెంట్స్‌పై తాప్సీ స్పందిస్తూ… ‘కరణ్ మంచివాడు. ఏ బ్యాగ్రౌండూ లేని నేను బాలీవుడ్‌లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నా’ అని కౌంటర్ ఇచ్చారు. ఇదే వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణమైంది.