పవిత్ర ఆధ్యాత్యిక క్షేత్రం తిరుపతి, తిరుమలలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో…. శ్రీవారి దర్శనం నిలిపివేస్తారని రెండు రోజులుగా మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఉద్యోగులు, తిరుమల అర్చకులతో పాటు ముఖ్యంగా పెద్దజీయం గార్ కరోనా బారిన పడడంతో దర్శనాల నిలిపివేతపై టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి పునరాలోచనలో పడినట్టు వార్తలొచ్చాయి.
దర్శనాల విషయమై పునఃసమీక్షిస్తున్నట్టు సాక్ష్యాత్తు పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుమల దర్శనాలపై నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన నగరాలు, ప్రాంతాల పరిస్థితి ఒక్క లెక్క, తిరుపతి -తిరుమల పరిస్థితి మరో లెక్క. ఎందుకంటే ఈ ప్రాంతాలను హిందువులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా భావిస్తారు. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా ఏపీ అంతా తెలిసిపోతుంది.
ఇప్పటికే శ్రీశైలంలో ఇద్దరు ముగ్గురు అర్చకులు కరోనా బారిన పడడంతో వారం పాటు మల్లికార్జునుడి ఆలయాన్ని వారం పాటు మూసివేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలోని ఆదిత్యుడి ఆల యాన్ని కూడా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మూసి వేయాలని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశించారు.
తిరుపతి, తిరుమలలో పరిస్థితి చేయి దాటిపోయిన విషయాన్ని సీఎంకు టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు నివేదిం చారని సమాచారం. దీంతో సీఎం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని తిరుపతి నగర వాసులు ఎంతో ఆశించారు. సీఎంపై తిరుపతి వాసులు ఆశలు పెట్టుకోడానికి కారణం లేకపోలేదు. టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకం విషయంలో టీటీడీ మొండిగా ముందుకెళుతున్న తరుణంలో జగన్ జోక్యం చేసుకుని…దాన్ని నిలువరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ విధంగానే జరుగుతుందని భావించారు, ఆశించారు.
అయితే జనానికి నిరాశ మిగిల్చే సమాచారం ఇది. దర్శనాల నిలిపివేతకు సీఎం జగన్ ససేమిరా అంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో దర్శనాలు నిలిపి వేయలేదని సీఎం వాదిస్తున్నారని తెలిసింది. తిరుమలలో దర్శనాలు నిలిపి వేస్తే బీజేపీ అగ్రనేతల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురవుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం.
ఏది ఏమైనా శ్రీవారి దర్శనాల నిలిపివేత తప్ప…మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని జగన్ సలహా ఇచ్చినట్టు విశ్వస నీయ సమాచారం. దీంతో టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు చేసేదేమీ లేక యధావిధిగా దర్శనాలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు తిరుపతి వాసులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.