ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై మంచు విష్ణు సూటిగా…

జ‌న‌సేనాని, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై యువ హీరో మంచు విష్ణు ఎలాంటి సంశ‌యం లేకుండానే సీరియ‌స్‌గా స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌తో తాను ఏకీభ‌వించ‌డం లేద‌ని మంచు విష్ణు కుండ‌బ‌ద్ద‌లు…

జ‌న‌సేనాని, టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై యువ హీరో మంచు విష్ణు ఎలాంటి సంశ‌యం లేకుండానే సీరియ‌స్‌గా స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌తో తాను ఏకీభ‌వించ‌డం లేద‌ని మంచు విష్ణు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. 

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల్లో మంచు విష్ణు అధ్య‌క్ష బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే. తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి మంగ‌ళ‌వారం  మంచు విష్ణు నామినే ష‌న్లు దాఖ‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తన మేనిఫెస్ట్‌ చూసిన తర్వాత చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు తనకే ఓటు వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తెలుగు సినీనటుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమ‌న్నారు. మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు తాను ముందే చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. కానీ, ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేన‌న్నారు. త‌మ ప్యాన‌ల్ విజ‌యం సాధిస్తుంద‌న్నారు.

ఇటీవ‌ల త‌న తండ్రి పేరు ప్ర‌స్తావిస్తూ  పవన్‌కల్యాణ్‌ అడిగిన ప్రశ్నలకు మోహ‌న్‌బాబే సమాధానం ఇస్తారన్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆయన ప్రకటన కూడా విడుదల చేశార‌న్నారు. 10వ తేదీ ఎన్నికలు ముగియ‌గానే 11వ తేదీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడతార‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల సినిమా టికెట్ల‌ను ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌నే నిర్ణ‌యంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న స్పందించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌తో తాను ఏకీభ‌వించ‌డం లేద‌న్నారు. ఇదే విష‌య‌మై  ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటన విడుద‌ల చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌కాశ్‌రాజ్ ఇండ‌స్ట్రీ వైపా, లేక ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైపు నిలుస్తారా?  అనే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబివ్వాల‌ని మంచు విష్ణు డిమాండ్ చేశారు.

త‌న‌తో పాటు త‌న ప్యాన‌ల్ స‌భ్యులు  ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  వైపు ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. నిర్మాత‌ల‌ను తాను దేవుళ్ల‌గా భావిస్తాన‌న్నారు. నిర్మాత‌లు లేనిదే ఇండ‌స్ట్రీ లేద‌న్నారు. నిర్మాత‌ల విజ్ఞ‌ప్తి మేర‌కే తాము ఆన్‌లైన్‌లో టికెట్లు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్వ‌యంగా బాధ్య‌త గ‌ల మంత్రి పేర్ని నాని చెప్పార‌ని మంచు విష్ణు తెలిపారు. పేర్ని నాని ప్ర‌క‌ట‌న‌లో వాస్త‌వం లేద‌ని ఏ ఒక్క నిర్మాత చెప్ప‌లేద‌ని ఆయ‌న అన్నారు.