చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి అధినేత. తండ్రి లాంటి స్థానంలో ఉండాల్సిన నేత. పైగా బాబుకు అందరికంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన ఉమ్మడి ఏపీకి రెండు సార్లు, విభజన ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు అన్ని ప్రాంతాలు సమానం అన్న భావన ఉండాలి.
వైసీపీ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుని అడ్డగోలుగా బాబు వ్యతిరేకిస్తున్నారు. విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారు. ఇపుడు ఏకంగా గవర్నర్ కి లేఖ రాయడం, అమరావతి రాజధానిని ఉంచేలా చూడాలని ప్రధాని మోడీని కోరడం ద్వారా విశాఖకు ఆయన మరింత దూరమయ్యారని అంటున్నారు.
చంద్రబాబుకు అమరావతి మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం విశాఖ రాజధాని వస్తూంటే అడ్డుకోవడం దారుణమేనని తమ్ముళ్లే అంటున్నారు. ఇక వైసీపీ అమరావతిని కూడా ఒక రాజధానిగా ఉంచుతామని చెబుతోందని, అదే సమయంలో చంద్రబాబు మాత్రం విశాఖ విషయంలో రెండవ రాజధానిగా ఉండకూడదన్న మొండి పట్టుదలతో ముందుకు పోతున్నారని అంటున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్రాలోని టీడీపీ కంచుకోటలకు బీటలు వారాయని, బాబు గత ఆరు నెలలుగా విశాఖ రాజధాని విషయంలో చిమ్ముతున్న విషంతో ఏకంగా సైకిల్ పార్టీని కిల్ చేస్తున్నారని ఆ పార్టీలోనే మధనం మొదలైంది. ఇవన్నీ ఇలా ఉంటే చివరి ఆఖరి ప్రయత్నంగా బాబు గవర్నర్ కి లేఖ పేరిట చేస్తున్న రచ్చ, రాజకీయంతో విశాఖకు రాజధాని ఆగకపోగా టీడీపీ పునాదులే పూర్తిగా కదిలిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని అంటున్నారు.
అయినా సరే బాబు మాత్రం అమరావతి జపం వదలకపోవడంతో రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రా టీడీపీలో అనూహ్య పరిణామాలు సంభవిస్తాయని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలకు అపుడు బాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు.