ఆంధ్రప్రదేశ్ అప్పులకుప్పగా మారిందంటూ.. ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశించినదాని కంటే ఎక్కువగా ఏపీ అప్పులు చేసిందని, అప్పులపై చెల్లించే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉందంటూ క్రెడిట్ రేటింగ్స్ సంస్థ విడుదల చేసిన గణాంకాలను ఉదాహరణగా చూపించింది. తాజా లెక్కల ప్రకారం దేశంలో అత్యథిక అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉందని, 2020 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీపై 3,41,270 కోట్ల రుణభారం ఉందంటూ ఈనాడు ఆవేదన వ్యక్తం చేసింది.
వాస్తవానికి ఇలాంటి బురదజల్లే వార్తలకు ఫస్ట్ పేజీ ప్రయారిటీ ఇచ్చే ఈనాడు.. దీన్నెందుకో లోపలి పేజీల్లోకి తోసేసింది. అయితే పరోక్షంగా ఏపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, జగన్ ని పలుచన చేయడం ఈ ఆర్టికల్ లక్ష్యం అని మాత్రం అర్థమవుతోంది. ఇక దీన్ని పట్టుకుని.. సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
అలవిమాలిన అప్పులెందుకు తెచ్చారంటూ టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే.. తీర్చే దమ్మున్న నాయకుడు కాబట్టే జగన్ ఆ సాహసానికి పూనుకున్నారంటూ వైసీపీ గట్టిగానే బదులిస్తోంది. వాస్తవానికి కరోనా కష్టకాలంలో ప్రతి రాష్ట్రం తల తాకట్టు పెట్టయినా అప్పు తేవాల్సిందే. కరోనా కష్టాల్లో కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పథకం ఆగిపోకుండా, ఏ పేదవాడికీ ఆర్థిక ప్రయోజనం వాయిదా పడకుండా చేశారు సీఎం జగన్.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రుణమాఫీ వాయిదా వేసినట్టు అన్ని పథకాలను వాయిదా వేసుకుంటూ వెళ్లిపోయేవారు. అయినా అప్పులు చేసి జగన్ ఏమీ దుబారా చేయట్లేదే. ప్రతి కుటుంబానికి నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాలు లేవు, ప్రారంభోత్సవాల హడావిడి లేదు. క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని ఒక్క మీటనొక్కి.. లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నారు.
జగన్ ని టార్గెట్ చేయాలని చూస్తూ.. ఈనాడు రాసిన కథనం.. ఒక రకంగా ప్రజల్లో జగన్ కి ఉన్న ఇమేజ్ ని మరింత పెంచింది. లాక్ డౌన్ తో దేశమంతా అల్లకల్లోలం అయిపోయిన సమయంలో కూడా ఏపీలో ప్రజలు ప్రభుత్వం అందించే సాయంతో నిశ్చింతగా ఉన్నారంటే అర్థమేంటి?
తన హయాంలో ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారు చంద్రబాబు. కానీ దాని వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ప్రచార ఆర్భాటలకు, తన మనుషుల జేబుల్లోకి మాత్రమే అవి సరిపోయాయి. ఫ్రంట్ పేజీలో వార్తను ప్రచురిస్తే ఈనాడు ఈ అంశాల్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకేనేమో లోపలి పేజీలకు పరిమితం చేసింది. అయితేనేం.. తనకు తెలియకుండానే జగన్ ను మరోసారి హీరోను చేసింది ఈ పత్రిక.