విశాఖలో గత అయిదేళ్ళలో కర్మాగారాలలో లెక్కలేనన్ని ప్రమాదాలు జరిగాయి. అయితే వాటిని నాడు కనీసం లైం లైట్ లోకి కూడా తీసుకురాలేదు సరికదా బాధితులకు ఏం న్యాయం జరిగిందో కూడా ఎవరికీ అర్ధం కాదు, ఇదిలా ఉండగా జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో విశాఖలోనే మూడు ప్రమాదాలు జరిగాయి. అవి కూడా గడచిన రెండు నెలల్లోనే చోటు చేసుకున్నాయి.
దీనిమీద దుమారం లేవదీస్తున్న టీడీపీ అనుకూల మీడియాకు నాడు బాబు హయాంలో జరిగిన ప్రమాదాలు కానీ, నాడు చనిపోయిన వారు కానీ ఎందుకు గుర్తురాలేదన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. నిజానికి 2015 నుంచి ఇప్పటిదాకా 26 ప్రమాదాలు జరిగాయని, అందులో 26 మంది చనిపోయారని, 70 మందిదాకా శాశ్వత క్షతగాత్రులు అయ్యారని ప్రముఖ పర్యావరణవేత్త, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ అసలు నిజాలు వెల్లడించారు.
అనాడు ఈ ప్రమాదాలపైన తీసుకున్న చర్యలేంటి అని ఆయన గత సర్కార్ పెద్దలనే ప్రశ్నించారు. నిజానికి నాడే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు వరస ప్రమాదాలు జరిగేవా అని ఆయన నిలదీశారు. నాడు ఏ రకమైన చర్యలు కానీ పర్యవేక్షణ కానీ లేదని, అందువల్లనే ఇలా ప్రమాదాలు పెరిగి పెద్దవైపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా చంద్రబాబు ఉమ్మడి సీఎంగా ఉన్న కాలంలో కానీ, అయిదేళ్ళు ఏపీ సీఎంగా ఉన్న టైంలో కానీ ఈ ప్రమాదాలపైన సరైన చర్యలు తీసుకోలేదన్న మాట ఇపుడు [పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది.
సరే ఇపుడు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ వీటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎటూ డిమాండ్ ఉంది. ఎల్జీ పాలిమర్స్ సీఈవో విదేశీయుడని కూడా చూడకుండా కటకటాలవెనక్కి నెట్టిన జగన్ అదే స్పూర్తితో మిగిలిన ప్రమాదాలకు కారకులైన వారికి గట్టిగా శిక్షిస్తేనే తప్ప ఈ ప్రమాదాలకు అంతూ పొంతూ ఉండదన్న భావనను మేధావులు సహా అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కఠినంగా ఉంటామంటోంది కాబట్టి ఇక ఈ ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడుతాయని నగరవాసులు అనుకోవచ్చేమో.