ఎవరేం మాట్లాడినా, ఎవరేం రాసినా కరోనాతో మొదలు పెట్టి, దాంతోనే ముగించాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో కూడా కరోనాకు ముందు, తర్వాత అని చరిత్రను రాసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచమంతా కరోనాతో విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారి పోయిందని తెలిసిన ఆ క్షణాన ప్రపంచం ఎంత గొప్పగా వేడుక జరపుకుంటుందో మాటల్లో వర్ణించలేం.
కరోనాను తరిమి కొట్టామనే సమాచారం తెలియగానే తాను మాత్రం ఆనందంతో చిందేస్తానని నటి అంజలి చెబుతున్నారు. గత మార్చి నెలాఖరు నుంచి లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు బంద్ అయిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర, వెండితెర నటీనటులు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయట పడుతామో తెలియని ఆయోమయ స్థితి.
ఈ నేపథ్యంలో కరోనా నుంచి ఉపశమనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. నటి అంజలి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఆమె ఇంట్లో ఎక్సర్సైజ్, డ్యాన్స్‌లతో అదరగొడుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా మిద్దెపై డ్యాన్స్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. కరోనా సమస్యకు పరిష్కారం లభించిన వెంటనే నడిరోడ్డుపై జెజ్జనక జెజ్జనక అంటూ డ్యాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళం, తెలుగు భాషా చిత్రాలు మూడేసి చొప్పున ఉన్నాయి.
అలాగే అనుష్కతో కలిసి నటించిన సైలెన్స్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరి అంజలి కోరిక తీరే రోజు ఎప్పుడొస్తుందో మరి! అభిమానులు అంజలి అంజలి అని పాట ఆలపిస్తుంటే…ఆమె వయ్యారంగా డ్యాన్స్ చేస్తుంటే…అబ్బో ఆ ఊహే ఎంత మధురమో!