ఇంత కాలం నిరాశనిస్పృహలతో ఉన్న జనసేనాని పవన్‌కల్యాణ్‌లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ఆయనలో కొత్త ఉత్సాహాన్ని చూపుతోంది. తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆయనలో రాజకీయంగా కొత్త ఆశలను చిగురింపజేసినట్టు ఆయన మాటలు వింటే తెలుస్తుంది. చంద్రబాబుతో పోల్చితే స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి ఫలితాలను పవన్‌కల్యాణ్ సానుకూలంగా మలుచుకున్నారనే భావన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.
ఇదే సమయంలో బీజేపీతో పొత్తు వల్ల కలిగే లాభనష్టాలపై ఓ అంచనాకు రావడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పనికొచ్చాయని జనసైనికులు చెబుతున్నారు. మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే టీడీపీ లేదా బీజేపీతోనే ఆయన ప్రయాణమని అర్థం చేసుకోవచ్చు. వైసీపీది దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన అని ఆయన మండిపడ్డారు. వారి కుట్రలను దీటుగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ఇందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు వెళ్లాయి.
ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడి 25.2% ఓట్లు సాధించామని చెప్పారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ దాష్టీక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నామన్నారు. దీనిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు.
ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతామన్నారు. పవన్‌కల్యాణ్‌లో ఎప్పుడూ కనిపించని ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆయన మాటల్లో కనిపించింది. అంతేకాదు, ప్రజల కోసం నిలబడితే, తమకు వాళ్ల మద్దతు ఉంటుందనే నమ్మకం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరిషత్ ఎన్నికల్లో జనసేన 1200 స్థానాల్లో పోటీ చేసి 177 స్థానాల్లో గెలుపొందిందన్నారు. పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రజల్లో మార్పు సంగతేమో గానీ, పవన్‌లో మాత్రం మార్పు తీసుకొచ్చాయి.
అందుకే ఆయన ఈ నెలాఖరులో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం, ఇక మీదట క్షేత్రస్థాయిలో పర్యటించాలనే నిర్ణయాలు తీసుకోవడం వెనుక స్థానిక ఎన్నికల ఫలితాలు తీసుకొచ్చిన మార్పుగా చెప్పొచ్చు. అయితే ఇది మాటల వరకేనా, చేతల్లో చూపుతారా? అనేది కాలమే జవాబు చెప్పాల్సి వుంది.