రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ నేతల సమావేశం నిర్వహించడమంటే… మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉంది. రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాలకుల్లో చంద్రబాబు ముందువరుసలో ఉంటారని ఆ ప్రాంత రైతాంగం ఆవేదనతో చెబుతోంది. రాయలసీమకు గుండెకాయలాంటి పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సాహసిస్తే… దాన్ని అడ్డుకోడానికి రాయలసీమేతరులతో చంద్రబాబు చేయి కలిపిన సంగతి తెలిసిందే.
అంతెందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమకు సాగునీటిని అందించే ప్రయత్నాలకు తెలంగాణతో పాటు చంద్రబాబు కూడా అడ్డుతగులుతున్నారనే విమర్శలు లేకపోలేదు. సీమకు సాగునీటిని అందించే ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం చేపట్టిందని, దీని వల్ల తమకెంతో నష్టమని స్వయంగా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చంద్రబాబుకు తెలియకుండానే లేఖలు రాసే ధైర్యం టీడీపీ ఎమ్మెల్యేలకు ఉందా?
ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో రాయలసీమలో జగన్‌ను దోషిగా నిలబెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడ వేసింది. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్ అంటూ ఆ ప్రాంత టీడీపీ నేతలు సమావేశాలను మొదలు పెట్టారు. ఇటీవల అలాంటి సమావేశం అనంతపురంలో పెట్టారు. ఆ సమావేశమే టీడీపీలో అంతర్గత విభేదాలకు కారణమైంది. తాజాగా ఇవాళ కడపలో రెండో సమావేశాన్ని నిర్వహించేందుకు టీడీపీ సమాయత్తమైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
రాయలసీమ కోసం జగన్ ఏమీ చేయకపోతే… ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలు రాయడం ఎందుకో శ్రీనివాస్ రెడ్డి చెబితే బాగుంటుంది. ఒకవైపు రాయలసీమను ఎడారిగా ఉంచడానికి, మరో ప్రాంత సొంత పార్టీ నేతలతో అడ్డుతగులుతూ, సీమలో మాత్రం దొంగ ఏడ్పులు ఏడ్వడం ఆ పార్టీకే చెల్లు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.