అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సంవత్సరం థియేటర్లలోకి రాదు కానీ, జనవరి ఎంతో దూరంలో లేదు కాబట్టి ఈ ఆతృత. ఫస్ట్ లుక్ పోస్టర్, మరో పోస్టర్ వదిలారు. టీజర్ కోసం చూస్తున్నారు అభిమానులు. దసరా సందర్భంగా విడుదల చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే అలా జరిగే అవకాశాలు తగ్గిపోయినట్లు తెలుస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ కు టీజర్ కటింగ్ మీద దృష్టిపెట్టే అవకాశం తక్కువ కావడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి విడుదల టార్గెట్ గా తయారవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా అన్నది కుదరదు. అలా వాయిదా వేస్తే, మహేష్ సినిమాను ఢీకొనలేక వాయిదా పడింది అన్న ట్రోలింగ్ లు, గ్యాసిప్ లు మొదలవుతాయి. కానీ సినిమా చూస్తే యాభైశాతం మాత్రమే పూర్తయింది.
అందుకే చకచకా షూట్ చేస్తున్నారు. అన్నపూర్ణలోని టబు ఇంటి సెట్ లో షూటింగ్ అవుతోంది. థమన్ ఓ పాటకు ఇంకా ట్యూన్ ఇవ్వాల్సివుంది. ఇప్పుడు ఆ ట్యూన్ చాలా అర్జెంట్ అని తెలుస్తోంది. టీజర్ కటింగ్ వ్యవహారం ఇప్పుడు పెడితే, ఆ ట్యూన్ లేటవుతుంది. అందుకే అల టీజర్ ను దసరాకు ఇవ్వడానికి వీలుకాకపోతే, దీపావళి ఇవ్వాలని చూస్తున్నారు.
దీపావళి అయితే అక్టోబర్ ఎండింగ్ లో వస్తుంది. అంటే రెండునెలల ముందుగా ఇచ్చినట్లు అవుతుంది. అందుకే దసరాకు అల టీజర్ వస్తుందా? అన్నది కాస్త అనుమానంగా వుంది.