పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విషప్రచారం తీవ్రస్థాయిలో సాగుతూ ఉంది. రివర్స్ టెండరింగ్ విషయంలో కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు. తమ మీడియా వర్గాల సాయంతో ఒక పథకం ప్రకారం.. ఏదో అన్యాయం జరిగిపోతోంది అంటూ ప్రజల్లో అభిప్రాయాలను కలిగించే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఒక కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అనేముద్ర వేసే వ్యూహాన్ని అమలు పరుస్తూ ఉన్నారు.
పోలవరం కాంట్రాక్టుల్లో ఉన్న తమ వారికి ఇబ్బంది కలగకుండా, వారు సాగించిన దోపిడీలు బయట పడకుండా.. అసలు రివర్స్ టెండరింగ్ మీదే వారు అక్కసు వెల్లగక్కుతూ ఉన్నారు. అలజడి రేపి ప్రజలకు తప్పుడు సమాచారాలను చేరవేస్తూ.. అలజడి రేపేందుకు ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి ఒకవర్గం నుంచి. తమ అక్రమాలు, అవకతవకలు బయటపడతాయనే భయంతో విషప్రచారం ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు.
సాధారణంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు వర్షాకాలంలో ముమ్మరంగా సాగవు. నదీ ప్రవాహం కారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మధ్యన పోలవరం పనులు సాగవు కూడా. దీన్ని అడ్డంపెట్టుకుని కూడా పోలవరం పనులు ఆగిపోయాయి, రివర్స్ టెండరింగ్ వల్ల ఆగిపోయాయని తెలుగుదేశం శక్తులు ప్రచారం చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల హయాంలో పోలవరం పనులు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలిసిందే.
విభజన జరిగినప్పుడే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్రం ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం కడితే తనకు క్రెడిట్ రాదని, కమిషన్లు రావనే లెక్కలతో ఆ ప్రాజెక్టులోకి చంద్రబాబు నాయుడు ఇన్ వాల్వ్ అయ్యారు. అక్కడ నుంచినే పోలవరానికి గ్రహణం పట్టింది. అవినీతి, అక్రమాలు హెచ్చుమీరాయి, ఆఖరికి పని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయారు. వారానికి ఒకరోజు పోలవారమంటూ ప్రచారం అయితే చేసుకున్నారు కానీ, ఫలితం మాత్రం కనిపించలేదు. వేలకోట్ల రూపాయల పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. నిబంధనలను తుంగలో తొక్కారు. అయితే అప్పుడంతా పోలవరం గురించి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ప్రచారం చేశారు.
పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఆదాయ వనరుగా మార్చుకున్నారని, ఏటీఎంగా చేసుకున్నారని స్వయంగా ప్రధాని మోడీ కూడా చంద్రబాబు నాయుడు విషయంలో స్పందించారు. ‘రాసుకో.. జగన్ మోహన్ రెడ్డి..’ అంటూ అసెంబ్లీలో పోలవరం పూర్తిచేయడం గురించి ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ ఒట్టిమాటలు అయ్యాయి. ఇక జలవిద్యుత్ ప్రాజెక్టుకు స్థలాన్నే అప్పగించకుండా, ఆ పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు.
అలాంటి పరిస్థితులు ప్రజలంతా గమనిస్తున్నవే, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ సంక్లిష్టమైన ఎత్తిపోతల పథకాలను వడివడిగా పూర్తి చేసుకుంటోంది. ఆ ప్రాజెక్టు ఫలాలు తెలంగాణ ప్రజలకు అందుతూ ఉన్నాయి కూడా. తెలంగాణలో అలాంటి పరిస్థితి కొనసాగుతుంటే, ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. నిధుల సమస్య లేని ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో అలా అయిపోవడం గమనార్హం.
కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. సకాలంలో పనులు పూర్తిచేయడం, బిల్లులు సమర్పించకపోవడం, కాంట్రాక్టర్లకు అప్పన్నంగా బిల్లులు చెల్లించడం, అందులోంచి కమిషన్లు పొందడం.. ఇదే చంద్రబాబు హయాంలో జరిగిందనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దాదాపు రెండువేల నాలుగు వందల కోట్ల రూపాయల మొత్తం స్థాయిలో అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తేల్చింది. దీన్నిబట్టి ఐదేళ్లలో దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మోడీ ఆ మాట ఎందుకన్నారో అర్థం చేసుకోవచ్చు.
కమిషన్లు తీసుకోకపోతే పనులు చేయకముందే యాభైశాతం నిధులను ఎందుకు విడుదల చేస్తారు? అనేది ప్రాథమిక ప్రశ్న. పనులు చేసినందుకు చేసిన చెల్లింపుల కన్నా.. అక్రమాలు, అవకతవకల పద్ధతుల్లోనే ఎక్కువ చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం తేల్చింది. ఈ అక్రమాలు అన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే రివర్స్ టెండరింగే మార్గమని తేల్చింది. హెడ్ వర్క్స్ లో మిగిలిన పనులు, జలవిద్యుత్ కేంద్రం పనులను ఒక ప్యాకేజీ కింద మార్చి.. టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే ప్యాకేజీగా ఈ పనులు చేయడం ద్వారా సమన్వయ లోపం కూడా ఉండదు. అలా రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
అధ్యయన కమిటీ సూచనల ప్రకారం.. హెడ్ వర్క్స్ కు సంబంధించి 1771.44 కోట్ల రూపాయల పనులు, జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించిన 3216.11 కోట్ల రూపాయల పనులను ఒక ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే జలవిద్యుత్ కేంద్రం పనుల కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేయడాన్ని కోర్టు రద్దుచేసింది. ఈ విషయంలో ప్రభుత్వం మళ్లీ కోర్టును ఆశ్రయించింది. సాంకేతికమైన అంశాలను, వాణిజ్య పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
ఆ విషయంలో విచారణ సాగాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం నిర్వహించిన ప్రీ బిడ్స్ కు నాలుగు సంస్థలు హాజరయ్యాయి. కాంట్రాక్టు వ్యవహారాలను పారదర్శకంగా వ్యవహరించడానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. టెండర్ డాక్యుమెంట్స్ ను ప్రజలకు కూడా అందుబాటులో ఉంచింది. పారదర్శకత, మొత్తం పనులను వేగంగా పూర్తిచేయడం.. వందల కోట్ల రూపాయల వ్యయాన్ని నియంత్రించడం.. వీటినే లక్ష్యంగా పెట్టుకుంది.
కాంట్రక్టర్లకు తగిన అర్హతల విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంది. అర్హత ఉన్న కాంట్రాక్టర్లలో తక్కువమొత్తాన్ని కోట్ చేసిన వారికే అవకాశం ఉంటుంది. సీవోటీ ఆమోదించిన తర్వాతే వారికి పనులను అప్పగిస్తారు. కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం సెల్ఫ్ డిక్లరేషన్ కోరుతూఉంది. అంచనా వ్యయంలో రెండున్నర శాతం బ్యాంక్ గ్యారెంటీతో పాటు, అంచనా వ్యయంలో ఒకశాతం డబ్బును జప్తుచేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయిస్తున్నారు. బిడ్ దాఖలు చేయాలంటే ఇవన్నీ తప్పనిసరి.
టెండర్లు వేయడానికే తగిన అర్హతలను పూర్తి సాంకేతికతో నిర్ణయిస్తారు. అర్హత సాధించని వారి బ్యాంకు గ్యారెంటీ, ఈఎండీలను జప్తుచేయడం జరుగతుంది. తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన కాంట్రాక్టర్ కోట్ చేసిన మొత్తంమీద కూడా మళ్లీ ఆక్షన్ ఉంటుంది. అర్హత సాధించిన కాంట్రాక్టర్లతో ఇందుకు సంబంధించి మళ్లీ ఇ-వేలం నిర్వహణ ఉంటుంది. అప్పటివరకూ బిడ్ ను పొందిన కాంట్రాక్టర్ కోట్ చేసిన అంచనా వ్యయం కన్నా.. తక్కువ మొత్తాన్ని అక్కడ కోట్ చేయాల్సి ఉంటుంది.
అత్యంత తక్కువ మొత్తానికి వేలం పాడిన కాంట్రాక్టర్ కే అప్పుడు పనులు దక్కుతాయి. స్థూలంగా అంచనా వ్యయాలను తగ్గించడమే లక్ష్యం. ఈ పారదర్శక నిర్ణయాన్ని నిపుణులు అభినందిస్తున్నారు కూడా. రివర్స్ టెండరింగ్ ద్వారా కనీసం ఇరవైశాతం వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. స్థూలంగా దీనివల్ల కొన్ని వందల కోట్ల రూపాయల మొత్తం వ్యయప్రయాస తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా.