మాయదారి కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసి కుమ్మేస్తోంది. మనుషుల ప్రాణాలతో పాటు దేశాల ఆర్థిక ఉసురు తీస్తోంది. దీంతో నిరుద్యోగం తాండవిస్తోంది. మూడు నెలల లాక్‌డౌన్‌తో అదుపులోకి వచ్చినట్టే వచ్చి…మళ్లీ పైచేయి సాధిస్తోంది. కరోనా వైరస్‌కు ఎలాంటి వైద్యం లేకపోవడంతో స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ బతకాలంటే చావు గురించి ఆలోచించలేని దుస్థితి.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. కరోనా పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి. కరోనా నష్ట నివారణ చర్యల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న విధానాలు ప్రశంసలు తెస్తున్నాయి. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడమే మంచిదని తెలంగాణ చానల్లో చెబుతున్నారంటే…ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకోవచ్చు.
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఎక్కడా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు. తన పని తాను చేసుకుపోతోంది. ఉదాహరణకు 104, 108 వాహనాలను కరోనా సమయంలో ప్రవేశ పెట్టి దేశ వ్యాప్తి దృష్టిని ఆకర్షించింది. జాతీయ, ఇతర భాషా ప్రాంతీయ మీడియాకు జగన్ దూరదృష్టి కనిపిస్తే…మన ఎల్లో మీడియా హ్రస్వ దృష్టికి అందులోని అవినీతి కనిపించింది. కరోనాతో క్వారంటైన్లో చేరిన రోగి…దిశ్చార్జి అయ్యే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలు అందిస్తుండడం చిన్న విషయం కాదు.
ఇక ప్రస్తుతానికి వస్తే కరోనా మృతుడి అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేతమే. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు కరోనా విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా ముందడుగు వేయడం ప్రశంసలు అందుకుంటోంది.
మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా 17 వేల మంది వైద్యులు, 12 వేల మంది నర్సులను తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మంచి జీతాలు ఇచ్చేందుకు వెనుకాడ వద్దని జగన్ సూచించారు. అంతేకాదు కరోనా రోగులకు అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ప్రతి కేంద్రానికి, ఆస్పత్రికి వారంలో కనీసం మూడుసార్లు ఫోన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాలనలో పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు అక్కడే కాల్‌సెంటర్ నెంబర్‌తో కూడిన హోర్డింగ్ ఏర్పాటు చేయాలని కూడా జగన్ సర్కార్ ఆదేశించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 33,019 మంది కరోనాబారిన పడ్డారు. అలాగే 408 మంది మృత్యువాత పడ్డారు. ఇక పరీక్షల విషయానికి వస్తే 12 లక్షలకు చేరువలో ఉన్నాయి.
ఇదే తెలంగాణ విషయానికి వస్తే 1,95,304 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 37,745 మంది కరోనాబారిన పడగా, 375 మరణాలు సంభవించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు…కరోనా నియంత్రణలో యువ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంటో? అలాగే కరోనా వైద్య పరీక్షలకు నిరాకరించే ప్రైవేట్ ఆస్పత్రి అనుమతుల రద్దుకు వెనుకాడమని ఏపీ సర్కార్ తాజాగా హెచ్చరించింది. కరోనాపై ఏపీ సీఎం జ‘గన్’ ఎక్కుపెట్టారని చెప్పక తప్పదు. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయి.