-అదే కుట్రల, కుతంత్రాల రాజకీయం!
-మారని చంద్రబాబు నాయుడు తీరు
-కుటిల వ్యూహాలూ వికటిస్తున్నాయి
-మోడీపై నోరెత్తితే ఒట్టు!
అవేకుట్రలు, అవే కుతంత్రాలు.. అవే వెన్నుపోటు రాజకీయాలు, అవే విష రాజకీయాలు.. ఏం తేడాలేదు. ఎక్కడున్నా తన తీరు ఒకేలా ఉంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకుంటూ ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఇప్పటికే పదేళ్ల అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరోసారి ఆ స్థానంలో కూర్చున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. కుట్ర కుతంత్ర రాజకీయాలతో, పాత వెన్నుపోట్లు.. కొత్త స్నేహాలతో.. అవే విషరాజకీయాలు, బురదజల్లుడు వ్యవహారాలతో చంద్రబాబు నాయుడు సాగుతున్నారు. ఇరవైమూడు మంది ఎమ్మెల్యేలను కొనుక్కొన్న తనను ప్రజలు ఇరవైమూడు మంది ఎమ్మెల్యేల బలానికి పరిమితం చేశారనే తత్వాన్ని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. 'నేనింతే..' అన్నట్టుగా సాగుతున్న చంద్రబాబు నాయుడు కుటిల, కుతంత్ర రాజకీయాల గురించి 'గ్రేట్ఆంధ్ర' ప్రత్యేక విశ్లేషణ ఇది.
37 యేళ్ల కిందట ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుమని పదేళ్లను పూర్తి చేసుకోలేదు. రెండు ఎన్నికలను ఎదుర్కొని.. ఒకసారి బ్రహ్మాండమైన విజయాన్ని, మరోసారి గౌరవ ప్రదమైన ప్రతిపక్ష హోదాను సంపాదించుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే. అయితే ఓడిపోయినప్పుడు మరీ చిత్తు అయితే మాత్రం సదరు పార్టీల నాయకత్వ తీరును అనుమానించాల్సిందే. విశేషం ఏమిటంటే.. ఎంతగా చిత్తు అయినా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మార్పులేదు, నాయకత్వ తీరులోనూ మార్పులేదు. పిడుగుకు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసింది ఒకే రాజకీయం. అదే కుటిల రాజకీయం!
మూడునెలల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెల్లుబుకుతోదంటూ వేస్తున్న వేషాలు.. చూస్తూ, 'ఔరా.. చంద్రబాబు నాయుడు..' అనుకుంటున్నారు సామాన్య ప్రజానీకం. అధికారం కోల్పోయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అల్లాడిపోతూ, జగన్ మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి కూడా! చంద్రబాబే అనుకుంటే.. అలాంటి రాజకీయాల్లో తనూ ఉన్నానంటూ మరోవైపు లోకేష్! స్థూలంగా వీళ్లిద్దరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 'ఎటుపోతోంది..' అంటూ తెలుగుదేశం పార్టీ కేడరే ఆశ్చర్యపోతూ ఉంది! చంద్రబాబు నాయుడు తరచూ వాడే 'ఎక్కడికిపోతున్నాం.. ' డైలాగుతో ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యపోతుంటే.. 'ఆ విధంగా ముందుకు..' అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. స్థూలంగా తెలుగుదేశం పయనం మాత్రం తెగిన గాలిపటంలా సాగుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!
ఇంకా అదే భ్రమలో చంద్రబాబు నాయుడు!
ఇది మీడియా యుగం కాదు.. సోషల్ మీడియా యుగం.. అని చంద్రబాబు నాయుడుకు ఎవరైనా గట్టిగా చెప్పాలంటూ కొందరు తెలుగుదేశం అభిమానులు ఘోషిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రెండు పత్రికలు రాసిందే జనాలు నమ్ముతారు. ఆ రెండు పత్రికలతోనే రాష్ట్రాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు.. అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని వారు వాపోతూ ఉన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు.. ఇంకా నలభైయేళ్ల కిందటి రాజకీయలే చేస్తూ ఉన్నారని, వాటిని చూసి జనాలకు విసుగు వచ్చిందని టీడీపీ వీరాభిమానులు వాపోతూ ఉన్నారు. అందుకు నిదర్శనం ఇటీవలి ఎన్నికల ఫలితాలు కావా? అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు!
లోపం చంద్రబాబు నాయుడులోనే ఉందంటారు పరిశీలకులు. చంద్రబాబు నాయుడు పూటకోమాట మాట్లాడారు, అదే నిజమని నమ్మాలని ప్రజల దగ్గర నమ్మబలుకుతారు. అయితే ఆ తర్వాత ఆయనే మాటలు మారుస్తూపోతారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడేది, అదే నిజం అన్నట్టుగా ప్రజలను నమ్మించడానికి ఆ మీడియా వర్గాలు శాయశక్తులా పనిచేసేవి. అయితే ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. సోషల్ మీడియా ఊపేస్తోంది. ఒక్కసారి నోరుజారితే.. అదే వైరల్‌గా సాగుతూ ఉంటుంది. ఏం చేసినా.. మళ్లీ వెనక్కు తీసుకోవడం, మాటలు మార్చి, మసిపూసి మారేడు కాయలు చేయడం సాధ్యంఅయ్యే పనికాదు. ప్రత్యేకించి ఆ మాట మార్పిడి ధోరణిని, అవకాశవాదాన్ని నేటితరం తీవ్రంగా అసహ్యించుకుంటోంది.
ఇంకా చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాలనే పాటిస్తూ తన రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. జగన్ పాలన విషయంలో తను పదే పదే ఒకేమాటనే చెబుతూ ఉంటే, అదే జనాలు నమ్మేస్తారని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అయితే అది కేవలం ఆయన భ్రమ మాత్రమే! అదే భ్రమలోనే ఆయన కొనసాగుతూ ఉంటే.. తెలుగుదేశం పార్టీ మెరుగైన స్థితిలోకి రావడం భ్రమలోని మాటే!
కేసులు ఎదుర్కొంటున్న నేతలపై మాట్లాడరేం!
చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవ ప్రదమైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టిన కోడెల శివప్రసాద్‌రావు కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన సంతానం సాగించిన దందాలకు సంబంధించి లెక్కకు మిక్కిలి కేసులు నమోదు అయ్యాయి. వారి బెదిరింపులకు హద్దేలేవని, వారి బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతూ ఉన్నారు. అంతేగాక.. అసెంబ్లీలో ఉండాల్సిన విలువైన ఫర్నీచర్‌ను కోడెల శివప్రసాద్ రావు తన తనయుడి వ్యాపార సంస్థల్లో వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి తరలించుకున్నారు. అందుకు సంబంధించి పట్టుబడ్డారు. కేసులు నమోదు అయ్యాయి. కేవలం కోడెల లీలలే కాదు.. యరపతినేని మైనింగ్ దందాలు, చింతమనేని రౌడీయిజాలకు సంబంధించి కూడా ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుస్తూ ఉంది. అయితే వారి విషయంలో తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నాయుడు స్పందించలేకపోతూ ఉన్నారు.
అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నది తన పార్టీ నేతలే అయినా చంద్రబాబు నాయుడు వారి గురించి మారు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారు తప్పు చేయలేదు అని చంద్రబాబు నాయుడు చెప్పడంలేదు. వారు ఆధారాలతో సహా పట్టుబడినా వారి మీద చర్యలు తీసుకోవడమో, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో చేయడంలేదు. తన వాళ్లు దొరికిపోతూ ఉంటే.. చంద్రబాబు నాయుడు అధికార పార్టీ మీద గగ్గోలు పెడుతూ ఉన్నారు. దొరికిన దొంగల గురించి మాట్లాడని.. వారిని తన పార్టీలోనే పెట్టుకుని.. వారి గురించి మారు మాట్లాడలేని, వారిని దాచి ఉంచుతున్న చంద్రబాబు నాయుడు అసలు నాయకుడేనా? అనే సందేహం ఎందుకురాదు ఎవరికైనా!
వికటిస్తున్న కుటిల వ్యూహాలు!
తెలుగుదేశం రాజకీయం సమాజాన్ని వీడి, సోషల్ మీడియాలోనే సాగుతూ ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాకే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి, అక్కడే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని అనుకుందాం. అయితే అక్కడ కూడా తెలుగుదేశం బోర్లాపడుతూ ఉంది. జగన్ మీద ఏదోరకంగా బురద జల్లాలి, విష ప్రచారం చేయాలనే తాపత్రయమే తప్ప.. తాము జనాల్లోకి వెళ్లాలి, ప్రజల సమస్యల గురించి స్పందించాలనే ఆసక్తి తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రమూ కనిపించడం లేదు. ఆశా వర్కర్లు జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారంటూ చంద్రబాబు నాయుడు తను చేసిన ట్వీట్‌తో ఎదురుదెబ్బ తిన్నారు.
మార్ఫింగ్ ఫొటోలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి చేతులు దులుపుకున్నారు. పద్నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి మరీ అంత చిల్లరగా వ్యవహరించడం జనాలకు ఏ సంకేతాలను ఇస్తోందో తెలుగుదేశం పార్టీ వాళ్లే అర్థం చేసుకోవాలని పరిశీలకులు అంటున్నారు! ఒకవేళ మీడియా మాత్రమే ప్రభావితం చేసేరోజుల్లో అయితే తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ కుట్ర రాజకీయాలు ప్రభావం చూపేవేమో! కానీ ఇప్పుడు రాజ్యం సోషల్ మీడియాది. దీంతో తెలుగుదేశం కుట్రలు కుదేల్ అవుతున్నాయి.
మోడీపై మాటెత్తరే!
మోడీని దించి తనే ప్రధాని పీఠంలో కూర్చోవడం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు హడావుడి చేశారు. ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయనేంత వరకూ చంద్రబాబు నాయుడి తీరు అలాగే కొనసాగింది. తనే ప్రధాని అవుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ఓటమిని చాలామంది ప్రచార పర్వంలోనే అంచనా వేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం పోలింగ్ పూర్తయ్యాకా కూడా అంచనా వేయలేకపోయారు! తను పోటీచేసింది ఏపీ వరకే అయినా.. తను ప్రధానిని కాబోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు తిరిగారంటే ఆయన తీరేమిటో అర్థం చేసుకోవచ్చు.
ఫలితాలు వచ్చేముందు చేసిన హడావుడికి, ప్రతి రాష్ట్రం తిరిగి.. అక్కడ పలికిన ప్రగల్భాలకూ.. ఫలితాల్లో చంద్రబాబు నాయుడుకు ఎదురైన ఓటమికి పొంతన పెట్టి చేస్తే.. అదో పెద్ద ప్రహసనం అవుతుంది. అదో ఎవరిగ్రీన్ కామెడీ అవుతుంది. అలాంటి కామెడీ చేసి కూడా.. ఇంకా తనో విజనరీ, తనో స్టేట్స్‌మన్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉండటం, దానికి పచ్చవర్గాలు వంతపాడుతూ ఉండటం మరో ప్రహసనం. వేరేవాళ్లు అయితే ఇలాంటి కామెడీలు చేసి మళ్లీ మొహం చూపించుకోవడానికి కూడా ముందుకు రాగలిగే వాళ్లు కాదు. జనాలు నవ్వుకుంటున్నారని భయపడతారు. అయితే చంద్రబాబు నాయుడులో మాత్రం అలాంటివేమీ కనపడవు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే మాటలు మార్చి, ఎలా అయితే పూటకోమాట మాట్లాడి.. వ్యవహరించారో, ఇప్పుడు కూడా అదేలా వ్యవహరిస్తూ.. తనో గొప్ప మేధావిని అని చంద్రబాబు నాయుడు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రహసనపు పనిలో ఉన్నారు. దానికి ఆయన కులమీడియా, కుల సైన్యం ఇతోధికంగా సహకారం అందిస్తూ ఉంది.
ఇక్కడ సామాన్యులకు వచ్చే డౌట్ ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు మోడీ మీద మాట్లాడటంలేదు? అనేది. వందరోజుల కిందట అధికారాన్ని చేపట్టింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేకాదు. మోడీ కూడా రెండోదఫాలో వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. జగన్ మీద అయితే చెలరేగిపోయి ట్వీట్లు పెట్టారు! అదే మోడీ మీద ఎందుకు ట్వీట్ చేయరు? మోడీ పాలన గురించి స్పందించాల్సిన అవసరమే లేదని అనుకుంటున్నారా? లేక ఇప్పుడు ఏం మాట్లాడినా కష్టమే అని కామ్ అయిపోతున్నారా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లే స్పందించాలి! తాము మోడీ గురించి స్పందించడానికి ఎందుకు భయపడుతున్నట్టో వాళ్లకే తెలియాలి.
మోడీ రెండోసారి అధికారం చేపట్టాకా తీవ్రమైన అరాచకం తెలుగుదేశం పార్టీ విషయంలోనే జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను నలుగురిని చేర్చుకోవడం. రాజ్యాంగబద్ధంగా చూస్తే, చట్టాల ప్రకారం చూస్తే.. చట్టసభల్లో విలీనాలు జరగవు. విలీనాలు అనేవి ఎన్నికల సంఘం ద్వారా జరిగేవి. అయితే బీజేపీవాళ్లు తెలుగుదేశం ఎంపీలు నలుగురిని చేర్చుకుని విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు! అది రాజ్యసభ వరకేనట! ఆ విలీనంపై చంద్రబాబు నాయుడు వెళ్లి ఢిల్లీలో ధర్నాకు దిగాలి!
ఎలా తమ పార్టీ ఎంపీలు నలుగురిని చేర్చుకుంటారంటూ.. గగ్గోలు పెట్టాలి. అదే ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలను జగన్ పిలిచి చేర్చుకున్నాడని అనుకుందాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టంకాదు. ఎక్కడెక్కడి నుంచినే నేతలకు ఫ్లైట్లు అరేంజ్ చేసి పిలిపించి, తను దీక్షకు దిగుతారు. వారందరినీ పిలిపించి.. తన శక్తి అది అని చాటుకుంటారు. ప్రజాస్వామ్యం హతమైందంటారు. ఇరవై మూడుమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తను అప్పుడు చెప్పే లెక్చర్లకు ఒక హద్దంటూ ఉండదు!
అయితే ఏకంగా దేశంలోని ఎగువసభలో ఎంపీలను బీజేపీ కాజేస్తేనే చంద్రబాబు నాయుడు స్పందించలేకపోతూ ఉన్నారు. స్పందిస్తే.. తనకు ఏ కేసు చుట్టుకుని జైలుకు పంపుతుందనే భయం చంద్రబాబులో ఉందని సామాన్యులు అనుకుంటున్నారు. మరో ప్రచారం ఏమిటంటే.. ఆ ఎంపీలను చంద్రబాబు నాయుడే బీజేపీలోకి పంపారని, అక్కడ తనవాళ్లు కొందరు ఉంటే.. తన సన్నిహితులు అక్కడ ఉంటే.. కీలకమైన సమయాల్లో వాళ్లు రక్షిస్తారని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
ఇదీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు బయటకు వెళ్లినా.. చంద్రబాబు నాయుడు మీదే జనాల్లో అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే.. టీడీపీ అధినేత ఇమేజ్ ప్రజల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మోడీ పాలనలోని తరగుమెరుగుల గురించి మాట్లాడే ధైర్యం చంద్రబాబు నాయుడు చేసే సంగతి సరేసరి!
ఇదీ వందరోజులు దాటిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వాసం పరిస్థితి! ట్విట్టర్ దాటని రాజకీయం, కుల నేతలను కాపాడుకోవడానికి చలో ఆత్మకూరు, ఎంపీలను బీజేపీకి చదివించుకుని కిక్కుమనకపోవడం, కుటిల రాజకీయ వ్యూహాలను పన్ని జగన్ మీద బురద జల్లాలని చూడటం.. మరోవైపు రెండుచోట్ల పోటీచేసి కనీసం ఒక్కచోట నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్ ప్రాపకం కోసం ప్రాకులాడటం.. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రస్థానం.
ఇక మరోవైపు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన నేతల గుట్టూ క్రమక్రమంగా బయటపడుతూ ఉంది. కోడెల శివప్రసాద్‌రావు పార్టీ పరువును తీసిన వైనం గమనిస్తే.. టీడీపీ ఇప్పుడప్పుడే కోలుకునే అవకాశాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు… మళ్లీ ఇప్పుడప్పుడే ఆ పార్టీని ఆ ఛాయల్లోకి కూడా వెళ్లనిచ్చేలా లేవని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.