మలయాళీ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటీనటుల ఎంపిక సాగుతోంది. మలయాళీ వెర్షన్ లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను తెలుగులో దక్షిణాది నటుడు రహమాన్ చేయనున్నాడని తెలుస్తోంది. రెండు రోజులుగా దీనికి సంబంధించిన సంప్రదింపుల వార్తలు రాగా, తెలుగు వెర్షన్ లో ఆ పాత్ర చేయడానికి రహమాన్ ఓకే చెప్పినట్టుగా సమాచారం.
ముందుగా తెలుగులో కూడా వివేక్ ఒబెరాయ్ చేత ఆ పాత్రను చేయించడానికి సంప్రదింపులు జరిగాయట. అయితే అతడు అందుకు సుముఖం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. తొలిసగంలో వివేక్ పాత్ర క్రూయల్ విలన్ గా మెరిసినా, ఆ తర్వాత మళ్లీ ప్రాధాన్యత ఉండదు. అలాంటి పాత్రలను రహమాన్ కూడా పండించగల నటుడే.
అయితే ఈ సినిమాకు ఇంకా చాలా మంది ప్రముఖ నటుల అవసరం ఉండవచ్చు. మంజూవారియర్ పాత్రకు సుహాసినిని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ధ్రువీకరణ లేదు. మలయాళీ వెర్షన్ లో దర్శకనటుడు పృథ్విరాజ్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్ చేసిన పాత్ర కూడా ఆరంభంలో ప్రాధాన్యత ఉండేదే. పృథ్విరాజ్ చేసిన పాత్రతో సహా మరిన్ని ఆసక్తిదాయకమైన పాత్రల్లో తెలుగు వెర్షన్లో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తిదాయకమైన విషయం.