నటుడు సోనూసూద్ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పాడు. ఐటీ రైడ్స్ తో వార్తల్లో నిలిచిన సోనూ.. ఇప్పుడు జరిగిన పరిణామాలపై స్పందిస్తున్నాడు. సోనూ భారీ ఎత్తున ఐటీ అవకతవకలకు పాల్పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. కరోనా సమయం నుంచి సహాయకకార్యక్రమాలతో సోనూ వార్తల్లో నిలిచిన సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకూ సోనూ పేరు దాతృత్వానికి మారుపేరుగా నిలిచింది. అయితే సోనూ భారీ ఎత్తున ట్యాక్స్ ను ఎగ్గొట్టాడని, విరాళాలను సేకరించి, అందులో ఖర్చుపెట్టిన మొత్తం చాలా తక్కువ అనే వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని సోనూ కొట్టిపడేస్తున్నాడు.
ఈ మేరకు టీవీ చానళ్లకు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తను ఎలాంటి పన్ను అవకతవకలకూ పాల్పడలేదని అంటున్నాడు. ఇక ఈ వ్యవహారంలో రాజకీయం కూడా ఇన్ వాల్వ్ అవుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశంలో సోనూ బ్రాండ్ అంబాసిడర్ కావడంతో బీజేపీ వాళ్లకు కోపం వచ్చిందని, అందుకే సోనూను బద్నాం చేస్తున్నారనే ఆరోపణలకూ లోటు లేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో సోనూ వివరణ ఇచ్చుకుంటున్నాడు.
ఆ ఇంటర్వ్యూల్లో ఆయన ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతున్నాడు. తనకు ఇప్పటి వరకూ రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం విషయంలో ఆఫర్ వచ్చిందని సోనూ అంటున్నాడు. రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేస్తామంటూ తనకు ఆఫర్ వచ్చిందని, అయితే రెండు సార్లూ తను తిరస్కరించినట్టుగా సోనూ చెబుతున్నాడు. బాలీవుడ్ నటీనటుల్లో చాలా మందికి ఇలాంటి ఆఫర్లు వస్తుంటాయి. అయితే పెద్ద పెద్ద స్టార్లకూ, రాజకీయ పార్టీలో అంటకాగే వాళ్లకే ఈ అవకాశాలు ఎక్కువ. సోనూ మరీ బిగ్ స్టార్ కాదు, అలాగే ఏ పార్టీతోనూ అంత సంబంధాలు కనపడవు. అయితే.. తనకు రెండు సార్లు ఆ ఆఫర్ వచ్చిందని సోనూ చెబుతున్నాడు.
బహుశా కరోనా సమయంలో సేవాకార్యక్రమాలతో వార్తల్లోకి ఎక్కాకా సోనూకు ఈ ఆఫర్లు వచ్చి ఉండొచ్చు. రెండుసార్లు వచ్చిన ప్రతిపాదనలనూ తను తిరస్కరించినట్టుగా ఈ నటుడు చెబుతున్నాడు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకు లేదని, ఆ రోజు వచ్చినప్పుడు తనే ఇల్లెక్కి ఆ ప్రకటన చేస్తానంటూ సోనూసూద్ చెప్పుకొచ్చాడు. అయితే తనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసిన పార్టీలు లేదా పార్టీ ఏదో సోనూ చెప్పలేదు.