ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ధైర్యాన్ని కూడదీసుకున్నారు. తననెక్కడ కేసుల్లో ఇరికిస్తారో అనే భయంతో గత కొంత కాలంగా మోడీ అంటే ఎంతో భయభక్తులతో చంద్రబాబు మెలుగుతున్నారనే వాదన లేకపోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూటమిలో చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు.
ఇందులో భాగంగా బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో ఆయన కలిసి పని చేయడం సంచలనం కలిగించింది. ఒక దశలో దేశ ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు పేరును ఎల్లో మీడియా తెరపైకి తేవడాన్ని చూశాం. ప్రధాని మోడీకి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబే అన్న రీతిలో ప్రచారం జరిగింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే… ఎల్లో బ్యాచ్ ఆశలు గల్లంతయ్యాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం, ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది.
అంత వరకూ మోడీ అంటే అలాంటోడు, ఇలాంటోడని విమర్శించిన చంద్రబాబు, టీడీపీ నేతలు …ఓటమి దెబ్బతో ఆయన్ను కీర్తించడం మొదలు పెట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ అడిగినా, అడక్కపోయినా టీడీపీ మద్దతు తెలుపుతూ వస్తోంది. ఇందులో భాగంగా అన్నదాతలకు సంబంధించి చట్టాలకు కూడా టీడీపీ, వైసీపీ మద్దతు తెలిపాయి. వాటికి అనుకూలంగా అత్యున్నత చట్ట సభల్లో ఓటు వేశాయి.
టీడీపీ ఒక అడుగు ముందుకేసి మోడీ సర్కార్‌కు మద్దతు ఇవ్వాలని ప్లీనరీ సమావేశంలో ఏకంగా తీర్మానం కూడా చేసింది. అయితే రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దీంతో రైతుల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వుంటుందని టీడీపీ, వైసీపీ తదితర ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 27న వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ప్రకటించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న ఈ బంద్‌కు మద్దతు ఇవ్వడం అంటే చంద్రబాబు సాహసం చేసినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఇది మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన బంద్. మరో రెండున్నరేళ్లలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రైతుల అభిమానాన్ని చూరగొనేందుకు …మోడీ వ్యతిరేక ఆందోళనకు దిగుతున్నారనే చర్చ నడుస్తోంది. మోడీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని బాబు నమ్మితే, ఆయనకు గోతులు తీయడానికి ఏ మాత్రం వెనుకాడరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుండగా భారత్ బంద్‌పై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.