మలయాళీ సినిమా అయ్యప్పనుమ్ కోషీయుం సినిమా తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ విషయంలో ఒరిజినల్ వెర్షన్ చూసిన వారి నుంచి వినిపిస్తున్న ప్రధాన అభిప్రాయం.. ఈ రీమేక్ ను చెడగొట్టేస్తారేమే అనేది! ఇప్పటికే టైటిల్ ను వన్ సైడెడ్ గా మార్చేయడంతో ఈ మూవీ మేకర్లు ఆ అభిప్రాయాలకు ఆస్కారం ఇచ్చారు.
అయ్యప్పన్, కోషీ.. ఈ రెండు పేర్లనే మలయాళంలో టైటిల్ గా పెట్టగా, కోషీ పాత్రకు తెలుగు టైటిల్లో స్థానం ఇవ్వలేదు! భీమ్లానాయక్ అంటూ పవన్ కల్యాణ్ పాత్రను హైలెట్ చేస్తూ వచ్చారు. టైటిల్ తోనే ఇది హీరోయిజం సినిమాగా మారిందేమో అనిపిస్తోంది. అయితే తాజాగా రానా కు సంబంధించిన స్మాల్ వీడియోను విడుదల చేసి అతడికీ ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.
ఇక ఆ వీడియోలో తన పేరు ధర్మేంద్ర అంటూ షోలే సినిమాను గుర్తు చేస్తున్నాడు రానా. మీ ఆయన గబ్బర్ సింగ్ అంట కదా.. అంటూ తనను ధర్మేంద్ర అంటూ పరిచయం చేసుకుంటున్నాడు. ఇలా షోలే సినిమా సినిమా రిఫరెన్స్ ను పట్టుకొచ్చారు. షోలే లో విలన్ పాత్ర పేరు గబ్బర్ సింగ్. హీరోల్లో ఒకరు ధర్మేంద్ర. గబ్బర్ సింగ్ పని పట్టేది ధర్మేంద్రే, కాబట్టే పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ ఇమేజ్ కు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంది. ఈ షోలే రిఫరెన్స్ సరదాగానే ఉంది.
అయితే సోషల్ మీడియాలో రానా పాత్రపై ఒక ట్రోల్ నడుస్తూ ఉంది. రానా పాత్రను విలన్ గా మార్చేస్తున్నారంటూ నెటిజన్లు రకరకాల మీమ్స్ తో ఆటాడుకుంటున్నారు. ఇందుకు కందిరీగ సినిమాను వాడుకుంటున్నారు. ఆ సినిమాకు రచయితగా పని చేసిన అనిల్ రావిపూడి ఆ కథను చెప్పే సమయంలో సోనూసూద్ కు తనది హీరో తరహా పాత్ర అని చెప్పాడట.
అయితే షూటింగ్ వచ్చిన సోనూకు హన్సికను వేధించే సీన్ ను వివరించారట. తనది నెగిటివ్ రోల్ కాదని, అలాంటి సీన్ ఎందుకు చేయాలంటూ అమాయకంగా అడ్డం తిరిగాడట సోనూ. అయితే నువ్వు విలన్.. నువ్వు విలన్.. చివరకు అతడికి సర్ది చెప్పారట. అయ్యప్పన్ రీమేక్ విషయంలో కూడా రానాకు ఈ మూవీ మేకర్లు అలాంటి ట్రీట్ మెంటే ఇచ్చారేమో అంటూ సెటైర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో!