నిజంగా ఇది ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో మాదిరిగా మన దేశంలో కూడా శవాల గుట్టలను చూడాల్సిన దుస్థితి ఎదురు కావచ్చు. ఆస్పత్రులు ఏ మాత్రం సరిపోనంతగా కరోనా రోగులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి భారత్ మెడపై కరోనా కత్తి వేలాడుతోంది.
వ్యాక్సిన్ లేదా కొవిడ్-19 నివారణ మందు రాని పక్షంలో వచ్చే ఏడాది శీతాకాలం ముగిసే నాటికి రోజుకు 2.87 లక్షలు చొప్పున కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకుల అధ్యయన నివేదికలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని చెప్పక తప్పదు.
ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశమే. గత వారం రోజుల లెక్కలను పరిశీలిస్తే మనమెంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకోవచ్చు. అమెరికాలో రోజుకు సగ టున 1.8% , బ్రెజిల్‌లో 2.7%, రష్యాలో 1%, పెరూలో 1.2% కేసులు పెరుగుతున్నాయి. ఇదే భారత్‌లో మాత్రం గతవారం రోజుకు సగటున 3.5% మేర వృద్ధి నమోదు కావడం ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో కేసులు రోజురోజుకూ తమ రికార్డులను తామే తిరగరాసుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయా నికి వస్తే దాదాపు ప్రతిరోజూ వెయ్యికి పైగానే కేసులు నమోదు కావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశ వ్యాప్తంగా పాజిటివ్ రేటు తొలిసారి 7% దాటడం చాలా ఆందోళన కలిగించే పరిస్థితి.
నిన్న మొన్నటి వరకు కరోనా కేసుల విషయంలో అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రెజిల్ తదితర దేశాల్లో నమోదవుతున్న సంఖ్యను చూసి మనం ఆశ్చర్యపోయే వాళ్లం. మన దేశంలో అలాంటి దుస్థితి లేదని హమ్మయ్య అంటూ గుండెల మీద చేతులేసుకుని హాయిగా ఊపిరి తీసుకునే వాళ్లు. అయితే రానున్న రోజుల్లో మనకు నిద్రలేని రాత్రులే అని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుని అప్రమత్తం కాకపోతే మాత్రం భారత్ కూడా పైన పేర్కొన్న దేశాల సరసన చేరడానికి మరెంతో కాలం పట్టిందనే ప్రమాద సంకేతాలు వస్తున్నాయి.
కాగా శీతాకాలం నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని ఎంఐటీ సంస్థ శాస్త్రీయ పరిశోధన నివేదిక తెలియజేస్తోంది. ఈ సంస్థ పరిశోధన ప్రకారం భారత్, అమెరికా, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఇండోనేసియా, బ్రిటన్, నైజీరియా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీలు తొలి పది స్థానాల్లో నిలుస్తాయని లెక్కకట్టింది.
84 దేశాలకు చెందిన 475 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని పరిశీలించి నమూనాను అభివృద్ధి చేసినట్లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు వెల్లడించడాన్ని ఆశామాషీగా తీసుకోడానికి లేదు. ఎందుకంటే వారు అంచనా వేసినట్టుగానే…ప్రస్తుతం మన దేశంలో కేసులు నమోదు కావడాన్ని గుర్తించాలి.
‘సామూహిక రోగనిరోధక శక్తి’ సాధించేందుకు చేరువగా ఏ దేశమూ లేదనీ, దాని కోసం నిరీక్షించడం ఆచరణీయ మార్గం కాదని ఆ పరిశోధక సంస్థ తేల్చేయడం ద్వారా… అసలు నిజాలేంటో చెప్పకనే చెప్పినట్టైంది. కావున ఎవరో వస్తారు…ఏదో చేస్తారనే ఉదాసీనతను వీడి, మనల్ని మనం కాపాడుకోవాలనే లక్ష్యంతో అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మన ముందున్న ఏకైక కర్తవ్యం.