ఎవరు ఔనన్నా, కాదన్నా.. సామాజిక మాధ్యమాల్లో టిక్ టాక్ ని మించింది లేదంటే అతిశయోక్తి కాదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లను మించి సామాన్య జనాల్లోకి దూకుకెళ్లిన టిక్ టాక్.. పెద్ద పెద్ద కంపెనీల రెవెన్యూపై కూడా పెద్ద దెబ్బ కొట్టింది. భారత్ తయారీ యాప్స్ కూడా దానితో పోటీపడలేకపోయాయి. దానికి డూప్లికేట్ తయారు చేయాలని చూశారే కానీ, ఆత్మను పట్టుకోవాలని ఎవరూ ట్రై చేయలేదు. అందుకే ఇన్నాళ్లూ దానికి ఆల్టర్నేట్ రాలేదు.
టిక్ టాక్ పై భారత్ నిషేధం విధించిన తర్వాత ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ అన్నీ పుట్టుకొస్తున్నాయి. టిక్ టాక్ కి అసలు సిసలు ప్రత్యామ్నాయం మాదంటే మాదంటూ కోట్లు ఖర్చుపెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నాయి.
మొదట్లో చింగారీ అనే యాప్ బాగా ప్రచారంలోకి వచ్చింది, అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారని, మిగతావాళ్లు కూడా ఇన్ స్టాల్ చేసుకున్నారు కానీ పెద్ద ప్రయోజనం లేదని పెదవి విరిచారు. ఇటీవల రీల్స్ పేరుతో మరో యాప్ వచ్చింది. టిక్ టాక్ కి మాదే ప్రత్యామ్నాయం అంటూ గొప్పలు చెబుతున్నారు కానీ, దానిది కూడా అదే పరిస్థితి అని తేల్చేశారు యూజర్లు.
మోజ్ అనే పేరుతో మరో కొత్త యాప్ విపరీతంగా యాడ్స్ ఇస్తోంది. డబ్ శ్మాష్, ఫనిమేట్, చీజ్, ట్రిల్లర్, లైకీ వంటి మరిన్ని యాప్స్ ఉన్నా కూడా వాటితో ప్రయోజనం అంతంతమాత్రమే. ప్రస్తుతం గూగుల్ సెర్చ్ లో భారతీయ నెటిజన్లు ఎక్కువగా వెదుకుతోంది కూడా టిక్ టాక్ ఆల్టర్నేట్ కోసమే.
“టాప్ 5 ఆల్టర్నేట్ యాప్స్ ఫర్ టిక్ టాక్”… “టాప్ 10 ఆల్టర్నేట్స్ ఫర్ టిక్ టాక్”.. వంటి ఆర్టికల్స్ కి లెక్కే లేదు. ఇలాంటి ప్రమోషన్ కోసం చాలా కంపెనీలు డబ్బులు కుమ్మరిస్తున్నాయి. సందడ్లో సడేమియాలాగా టిక్ టాక్ ప్రో పేరుతో ఓ నకిలీ యాప్ హల్ చల్ చేస్తోందని, దానిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.
మొత్తమ్మీద టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత కూడా దాని స్థానాన్ని చేజిక్కించుకోవడం మరే ఇతర అప్లికేషన్ కీ సాధ్యం కావడం లేదు. టిక్ టాక్ ఓ ముగిసిన అధ్యాయం. దానికి ఆల్టర్నేట్ ఇప్పుడప్పుడే రాదనేది నిజం.