కరోనా లాక్ డౌన్ తర్వాత తెలుగు సీరియళ్ల షూటింగ్ ఎంత హడావిడిగా మొదలైందో అంతే వేగంగా ఆగిపోయింది. ఇప్పటికే పలు సీరియల్స్, రియాల్టీ షోల కోసం పనిచేసే నటీనటులు, కొందరు టెక్నీషియన్లకు కరోనా సోకడంతో ఆయా సీరీయళ్లు, షోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఛానెళ్లన్నీ కొత్త సీరియల్స్ షోలు అంటూ యాడ్స్ కూడా ఇచ్చేశాయి. ఇలాంటి టైమ్ లో మరోసారి అన్నీ ఆపేయాల్సిన పరిస్థితి.
రోజురోజుకీ తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్నాళ్లు షూటింగ్ లు ఆపేస్తే మంచిదంటూ అధికారులు కూడా మౌఖికంగా ప్రొడక్షన్ సంస్థలకు చెప్పేస్తున్నారు. ఇప్పటికిప్పుడు జీవో జారీ చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, స్వచ్ఛందంగా షూటింగ్స్ ఆపేయాలని సూచిస్తున్నారు. ఇలా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిల్లో ఈ వారాంతానికి టీవీ సీరియళ్లు, షో ల షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోతాయని తెలుస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన షెడ్యూల్స్ ని పూర్తి చేసి నిరవధిక లాక్ డౌన్ కి సీరియల్ పరిశ్రమ మొగ్గు చూపుతోంది.
అటు సినిమా వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఎంత పగడ్బందీగా, కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేస్తున్నా.. లోలోపల లీడ్ యాక్టర్స్ లో భయం ఉంటూనే ఉంది. దీంతో కొన్నాళ్లు షూటింగ్ లు ఆపేద్దామనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. పెద్ద హీరోల సినిమాలేవీ ఇంకా మొదలు కాలేదు కానీ.. చిన్నాచితకా ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి, ఇప్పుడు అవి కూడా ఆగిపోతున్నాయి.
ఉపాధి కోసం రోజూ షూటింగ్ లకు హాజరవుతున్నా.. ప్రతిరోజూ భయంతోనే గడుపుతున్నారంతా. చాలామంది సెట్స్ లో ప్రొడక్షన్ భోజనం కూడా చేయడం లేదు. ఇంట్లో నుంచి తెచ్చుకున్న భోజనం లేదా స్నాక్స్ లాంటివి తిని పని కానిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా షూటింగ్ లు ఆపేయండి అంటూ అనధికారిక ఆంక్షలు విధించడంతో వీరికి ఊరట లభించింది.
సో.. కరోనా లాక్ డౌన్ తర్వాత ఆర్భాటంగా మొదలైన సీరియళ్లు, సినిమాలు మరోసారి ఆగిపోనున్నాయి. కేవలం ఓటీటీ రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్న సినిమా యూనిట్స్ మాత్రం తమ షూటింగ్స్ ను మరికొన్నాళ్ల పాటు కొనసాగించబోతున్నారు.