సింగిల్ ఎలక్షన్ తో ప్రతిపక్షాలను చాపచుట్టేసినంత ఈజీ కాదు.. స్వపక్షాన్ని సెట్ రైట్ చేయడం, అయితే ఈ విషయంలో తండ్రి వైఎస్ఆర్ కి లేని వెసులుబాటు సొంత పార్టీ అధినేతగా జగన్ కి ఉంది. అంతే కాదు.. ఇప్పటివరకూ ఎక్కడా జగన్ మాటకు ఎదురు చెప్పే ధైర్యం పార్టీ ఎమ్మెల్యేలు చేయలేదు. అయినా కూడా మంత్రివర్గ కూర్పు అంటే కత్తిమీద సామే.
అలాంటి తొలి దశను.. కొన్ని అసంతృప్తుల మధ్య విజయవంతంగా దాటారు సీఎం జగన్. సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, లాయలిస్టుల కోటాలో ఉన్న అంబటి రాంబాబు, సొంత సామాజిక వర్గానికి చెందిన చెవిరెడ్డి, రోజా, రామకృష్ణారెడ్డి లాంటి వారు కాస్త నొచ్చుకున్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసి మరోసారి జననేత అనిపించుకున్నారు.
అయితే జగన్ కి ఇప్పుడు అసలైన సవాల్ ఎదురైంది. మండలి రద్దు నిర్ణయంతో అనివార్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ మంత్రి పదవులు కోల్పోయారు. ఇప్పటికే వీరు రాజ్యసభకు ఎంపికయ్యారు కాబట్టి కొత్తవారిని వెతకాలి. ఆ రెండు పదవులు యథావిధిగా బీసీలకిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకట రమణ స్థానంలో అదే జిల్లా నుంచి బీసీ కోటాలో విడదల రజినికి అవకాశం దక్కొచ్చు, లేదు క్యాస్ట్ ఈక్వేషన్ పక్కనపెట్టి జిల్లానే తీసుకుంటే.. అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్య పోటీ ఉంటుంది.
ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో మరో బీసీని తేవాలా లేక, అదే జిల్లాకు పదవి ఇవ్వాలా అని తర్జన భర్జన పడుతున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం కూడా జగన్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇసుక తవ్వకాలు, మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వంపై విమర్శలకు కారణమైన ఇద్దరు మంత్రుల్ని తప్పించాలని జగన్ గట్టిగా అనుకుంటున్నారట. ఇదే నిజమైతే.. రెండున్నరేళ్ల తర్వాత చేపట్టాల్సిన మంత్రివర్గ పునర్నిర్మాణం ఇప్పుడే జరుగుతుంది.
అప్పుడు జగన్ ముందు ఆప్షన్లతో పాటు, అసంతృప్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మంత్రి పదవులు కోల్పోతున్నవారు, ఆశించి మరోసారి భంగపడేవారు.. కచ్చితంగా జగన్ ని కార్నర్ చేస్తారు. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్లంతా ఏదో ఒక విషయంలో బైటపడుతూనే ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. లోలోపల అసంతృప్తితో రగులుతున్న బ్యాచ్ కూడా ఉండనే ఉంది.
ఇలాంటి సమయంలో జగన్ మంత్రివర్గ విస్తరణ పేరుతో తేనెతుట్టె కదుపుతారా, లేక లౌక్యంగా ఆ రెండు శాఖల్ని వేరే మంత్రులకు సర్దుబాటు చేస్తారా.. అనేది తేలాల్సి ఉంది.