పోయినోళ్ళు మంచోళ్ళు …అధికారంలో ఉన్నోళ్లు మహా నేతలు

వైఎస్ విజయమ్మ ఏ ఉద్దేశంతో వైఎస్సార్ పన్నెండో వర్ధంతిని హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకుందోగానీ అది పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. వైఎస్సార్ అభిమానులు ఏ పార్టీలో ఉన్నా తరలి వస్తారని, ప్రేమతో సభను విజయవంతం…

వైఎస్ విజయమ్మ ఏ ఉద్దేశంతో వైఎస్సార్ పన్నెండో వర్ధంతిని హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకుందోగానీ అది పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. వైఎస్సార్ అభిమానులు ఏ పార్టీలో ఉన్నా తరలి వస్తారని, ప్రేమతో సభను విజయవంతం చేస్తారని విజయమ్మ అనుకుంది. కానీ ఆమె ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. 

వైఎస్సార్ ను మహా నేత అంటుంటారు. అలాంటి మహానేత వర్ధంతి సభకు రావడానికి రాజకీయ లెక్కలు అడ్డం వచ్చాయి. వివిధ పార్టీల్లో ఉన్న వైఎస్సార్ అభిమానులకు, పార్టీ పదవుల్లో, మంత్రి పదవుల్లో ఉన్నవారికి వైఎస్సార్ అంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఒకప్పుడు ఆయన ద్వారా రాజకీయంగా, ఆర్ధికంగా, పదవుల పరంగా ప్రయోజనం పొందిన వారంతా ఇప్పుడు తమ రాజకీయ స్వప్రయోజనాలు చూసుకున్నారు.

వైఎస్సార్ పన్నెండో వర్ధంతిని హైదరాబాదులో నిర్వహించాలని అనుకున్నప్పుడే రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వచ్చాయి. గత పన్నెండేళ్లలో ఏనాడు వైఎస్సార్ వర్ధంతి సభ హైదరాబాదులో జరిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు పనిగట్టుకొని సభ పెట్టడం. దానికి ఒకప్పుడు వైఎస్సార్ తో కలిసి పనిచేసిన నాయకులను, ఆయన ప్రభుత్వంలో పనిచేసినవారిని ఆహ్వానించడం వింతగా ఉండటమే కాదు యేవో రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారని అనుమానాలు రేకెత్తించింది. 

వైఎస్సార్ వర్ధంతిని రాజకీయ నాయకులే కాదు మీడియా కూడా పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్సార్ వర్ధంతి హైదరాబాదులో నిర్వహించారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. షర్మిలను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి వైఎస్ విజయమ్మ వైఎస్ వర్ధంతిని హైదరాబాదులో ప్లాన్ చేశారని అర్ధమైంది. షర్మిల కోసమే ఈ సభ అని రాజకీయ నాయకులంతా ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

దీంతో ఎందుకొచ్చిన చిక్కు అంటూ చాలా మంది నేతలు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ నుండి ఒక్క ఎంపీ కోమటిరెడ్డి మాత్రమే అటెండ్ కాగా. గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉండి, రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయిన ఉండవల్లి వంటి నేతలు మాత్రమే హజయ్యారు.నిజానికి వైఎస్ సెంటిమెంట్ తో కొద్దిమంది నేతలైన కలిసి రాకపోతారా అని షర్మిల టీం భావించింది. అది జరగలేదు. ఈ సభకు దూరంగా ఉండాలని వైసీపీ ముందే నిర్ణయించింది. 

కాబట్టి ఆ పార్టీలోని వైఎస్సార్ అభిమానులు ఎవరూ రాలేదు. కాంగ్రెస్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ లో వైఎస్ అభిమానులు ఎలాగూ రారు. టీఆర్ఎస్ మంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణాకు అన్యాయం చేశాడని వైఎస్సార్ ను తిడుతున్నారు. ఏది ఏమైనా వైఎస్సార్ ఇప్పడు మహానేత కాదు. మంచోడు. అంతే. మహానేతలు ఎవరయ్యా అంటే కేసీఆర్, వైఎస్ జగన్. వారిని కాదని ఆ రెండు పార్టీల్లోని వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.