పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో మొదటి నుంచి కామినేని శ్రీనివాస్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. దీని వెనుక సొంత పార్టీ కంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాలే దాగి ఉన్నాయని కొంత కాలంగా బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుజనాచౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరినప్పటికీ మనసంతా చంద్రబాబే అనే విమర్శలు లేకపోలేదు. అంతెందుకు రాజధాని విషయంలో సుజనాచౌదరి వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలోకి వచ్చిన కొందరు టీడీపీ నాయకులకు పాత వాసనలు పోలేదని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనాపై పరోక్షంగా జీవీఎల్ మండిపడ్డారు.
సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ పేరుకు బీజేపీ నాయకులైనా…వారిద్దరి అంతిమ రాజకీయ లక్ష్యం టీడీపీకి ప్రయోజనం కలిగించడమే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తాజాగా పార్క్ హయత్ హోటల్‌లో సుజనాచౌదరి, కామినేని, నిమ్మగడ్డ రహస్య భేటీ కావడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. అగ్గికి ఆజ్యం పోసినట్టు…టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చాలా తెలివిగా మాట్లాడి బీజేపీని ఆత్మరక్షణలో పడేశాడు. వర్ల రామయ్య ఏమన్నాడంటే…
‘సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ అసాంఘిక శక్తులు కాదు. నిమ్మగడ్డ వారితో సమావేశమైతే ఏంటి? అదేమీ చట్ట విరుద్ధ, న్యాయ విరుద్ధ సమావేశం కాదు. ఎన్నికల కమిషనర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవమానకరంగా ప్రవర్తిస్తోందో దేశ ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి వారి ద్వారా తెలియాలని నిమ్మగడ్డ అనుకుని ఉంటారు, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లినా స్టే రాలేదు. అప్పుడైనా నిమ్మగడ్డను మళ్లీ నియమించి ఉండాల్సింది. ఈ విషయంలో కేంద్రం పరిశీలన చేసి తనకు న్యాయం చేయాలని ఆయన కోరి ఉంటారు’
నిజానికి ఈ మాటలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అని ఉంటే ఏ సమస్యా లేదు. కానీ తమ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సుజనాచౌదరి గొప్పతనాన్ని టీడీపీ వెనుకేసుక రావడం వెనుక ఎలాంటి రాజకీయం లేదంటే అతిశయోక్తి అవుతుంది. నిన్న ఉదయం నుంచి అన్ని చానళ్లలో, సోషల్ మీడియాలో ఈ రహస్య భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే ఇంత వరకూ ఏపీ బీజేపీ నోరెత్తకపోవడం దేనికి సంకేతం?
కానీ సుజనాచౌదరి, కామినేని వ్యవహారంపై బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్టు సమాచారం. నిమ్మగడ్డతో రహస్య భేటీతో పార్టీ ప్రతిష్ట మసక బారిందని ఏపీ బీజేపీ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. దీంతో వారిద్దరిపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే టీడీపీకి అనుకూలంగా సుజనాచౌదరి, కామినేని వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు భారీగా వెళ్లినట్టు తెలిసింది.
ఒక వైపు సుజనా తమ భేటీపై స్పందిస్తూ…తమ మధ్య నిమ్మగడ్డ విధులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించాడు. మరోవైపు వర్ల రామయ్య మాత్రం దేశ ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి వారి ద్వారా తెలియాలని నిమ్మగడ్డ అనుకుని ఉంటారని, కేంద్రం పరిశీలన చేసి తనకు న్యాయం చేయాలని ఆయన కోరి ఉంటారని చెప్పడం ద్వారా వాళ్ల మధ్య రాజకీయ చర్చలు నడిచి ఉంటాయనే వాదనకు బలం చేకూర్చినట్టైంది.
ఈ వ్యవహారంలో చెడ్డపేరు మాత్రం బీజేపీకి మిగిలింది. రాజకీయంగా టీడీపీ లాభపడాలని చూస్తోంది. ఎందుకంటే బీజేపీ- వైసీపీ మధ్య విభేదాలను సృష్టించే ఇదొక అస్త్రంగా వాడాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే వర్ల రామయ్య మాటలను చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.