ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు రాజకీయం జ్ఞానోదయం అయినట్టుంది. ఇన్నాళ్లూ తనను తాను భావి ముఖ్యమంత్రిగా ఊహించుకుని.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ తో జేజేలు కొట్టించుకున్న జనసేనాని, ఇప్పుడు నేలమీదకొచ్చారు. తన పరిస్థితేంటి, తన పార్టీ స్టామినా ఏంటి అనే విషయాలపై ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నారు.
తన ఏడేళ్ల పొలిటికల్ ఎక్స్ పీరియన్స్ తో ఈసారి ఊహాజనిత రాజకీయాలు కాకుండా, ప్రాక్టికల్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా పవన్ వేసిన తొలి అడుగు ముఖ్యమంత్రి సీటుపై ఆశ వదిలేసుకోవడం.
సీఎం సీటుకి ట్రై చేస్తే కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రజలు గెలిపించలేదు. దీంతో అది అందని ద్రాక్షే అని అర్థమైంది. అయితే అందని ఆ సీఎం కుర్చీ పుల్లన అని కూర్చోకుండా కనీసం 30 ఎమ్మెల్యే సీట్లపై ఫోకస్ పెడితే ఎలా ఉంటుందనేది పవన్ ఆలోచన. వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి గరిష్టంగా 30 సీట్లు వస్తే చాలు అన్నట్టు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినప్పటికీ.. టార్గెట్-30 అనే ఎజెండాతో పనిచేయాలని అనుకుంటున్నారట పవన్. ముందుగా 30సీట్లు సెలక్ట్ చేసుకుంటారు. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా, రేపు టీడీపీతో సయోధ్య కుదిరినా కుదరకపోయినా.. ఈ 30 సీట్లలో జనసేన అభ్యర్థులే బరిలో దిగుతారు.
కేవలం ఆ 30 సీట్లు, వాటి పరిధిలో ఉండే పార్లమెంట్ స్థానాలపైనే పవన్, స్థానిక ఇన్ చార్జ్ లు ఫోకస్ పెడతారు. తరచూ ఆయా నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్తారు పవన్. ఏ పేరుతో ప్రజా పోరాటం చేసినా, ఆ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చూసుకుంటారు.
పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని బొక్క బోర్లా పడటం కంటే, చిన్న లక్ష్యాలు పెట్టుకుని కనీసం ఆ స్థాయిలో ముందుకు కదలడం మేలు అనే ఆలోచనకు వచ్చేశారు జనసేనాని. ఇక 2024 ఎన్నికల సమయానికి ప్రధాన పార్టీల తరపున సీట్లు దొరకని రెబల్స్ కలసి వస్తానంటే అది జనసేనకు ప్లస్ అవుతుంది. ఎలాగోలా టార్గెట్-30ని అందుకోవాలని అనుకుంటున్నారు.
30 సీట్లు అంటే మామూలు విషయం కాదు
నిజంగా పవన్ టార్గెట్-30 పెట్టుకొని, అనుకున్న సీట్లు సాధిస్తే అది జనసేన పార్టీకి చాలా పెద్ద విజయం అవుతుంది. ఎందుకంటే పార్టీ స్టామినా 1 నుంచి అమాంతం 30కి పెరిగినట్టవుతుంది. అంతేకాదు.. అదే సమయంలో పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ 30 అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆషామాషీ కాదు.
గత ఎన్నికల్లో టీడీపీనే 23కు పరిమితం చేశారు జగన్. ఇలాంటి టైమ్ లో జనసేనకు 30 అంటే అనుమానమే. కాకపోతే ఇప్పటికైనా జనసేనాని వాస్తవ పరిస్థితిని అర్థంచేసుకొని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అదే జనసైనికులకు పెద్ద ఊరట. 30 కాకపోతే కనీస మూడైనా వస్తాయని ఆశ.