అధికారం ఎక్కడుంటుందో అక్కడ వాలిపోవడం కొందరు నేతలకు వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు పవర్‌ను ఎంజాయ్ చేసిన వాళ్లలో దగ్గుబాటి పురందేశ్వరి తర్వాతే ఎవరైనా అని అంటుంటారు. ఎన్టీఆర్ తనయగా పురందేశ్వరికి రాజకీయంగా గౌరవం, గుర్తింపు ఉన్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం విశాఖ ఎంపీగా పురందేశ్వరి అత్యున్నత చట్టసభలో అడుగు పెట్టారు. కేంద్రమంత్రిగా పని చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్‌కు మంచిరోజులు లేవని భావించారో, ఆ క్షణమే ఆమె బీజేపీలోకి జంప్ అయ్యారు. తనకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కాంగ్రెస్‌ను నోటికొచ్చినట్టు ఆమె తిట్టడం గమనార్హం. ఇదే సందర్భంలో ఆమెపై కాంగ్రెస్ నాయకులు అదిరిపోయే పంచ్ విసిరారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. 2023లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పాలన ఉంది.
జగదల్‌పుర్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చింతన్‌శివిర్ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ఉమ్మితే …సీఎం బఘేల్, ఆయన మంత్రి వర్గం కొట్టుకుపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయ దుమారం రేపింది.
ముఖ్యమంత్రి బఘేల్ దీటైన కౌంటర్ ఇచ్చారు. ఆకాశంపై ఎవరైనా ఉమ్మితే అది వారి ముఖంపైనే పడుతుందని అదిరిపోయే పంచ్ విసిరారు.. పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారన్నారు. బీజేపీ చేరాక ఆమె మానసిక స్థితి దిగజారిందని తీవ్ర విమర్శ చేశారు. పురందేశ్వరి మన తెలుగు ఆడబిడ్డ కావడంతో ఆమెపై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.