నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ సమావేశం సంచలనం రేపుతూ ఉండగానే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరో బాంబు పేల్చారు. ఇప్పటికే నిమ్మగడ్డ, కామినేని, సుజనా చౌదరిల మీటింగుకు సంబంధించి వచ్చిపోవడాల వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతూ ఉన్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఎంతో నిష్టతో ఉండాల్సిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా రాజకీయ నేతలతో ఆంతరంగిక సమావేశాలు నిర్వహించడం పట్ల తటస్తులు కూడా ఖిన్నులవుతున్నారు! మరీ ఇంతలానా అని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ సంగతలా ఉంటే.. విజయసాయిరెడ్డి ఏమని ట్వీటేశారంటే..
'పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో…'
అంటూ ఆయన ఊరిస్తూ ఉన్నారు! నిమ్మగడ్డ, కామినేని, సుజనాలు ఆ హోటల్లో సమావేశం కాగా..ఫేస్ టైమ్ లో మరొకరు వారితో మాట్లాడారని విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే అదెవరు? అనే విషయంపై ఆయనే కొశ్చన్ మార్క్ పెట్టారు. ఆ వివరాలు అతి త్వరలో అని ప్రకటించారు. ఈ 'బిగ్ బాస్' అనే మాట చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యతిరేకులు వాడే మాట అనేది తెలుగు రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయమే. ఎప్పుడో 2000 సమయంలోనే బిగ్ బాస్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి కాంగ్రెస్ వాళ్లు సంబోధించే వాళ్లు.
ఈ క్రమంలో.. విజయసాయిరెడ్డి బిగ్ బాస్ అంటూ చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారా? అనే సందేహాలను జనింపజేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే అతి త్వరలో ఆ వివరాలను అందించబోతున్నట్టుగా కూడా విజయసాయిరెడ్డి ఊరిస్తూ ఉన్నారు.
మరి ఆ సమావేశం వివరాలు ఏమిటి? అనేది సర్వత్రా ఆసక్తి రేపుతున్న అంశం. అలాంటి వీడియో గనుక విజయసాయిరెడ్డి విడుదల చేయగలిగితే.. తెలుగు రాజకీయాల్లో అది మరో సంచలనం అవుతుంది. అదెలా ఉంటుందో..ఊహించగలిగిన వారికి ఊహించినంత!